
వలస కార్మికుల ఆచూకీ తెలపండి
రాయగడ: ఉపాధి కోసం పొరుగు రాష్ట్రం వెళ్లిన ఇద్దరి వలస కార్మికుల ఆచూకీ తెలపాలని బాధిత కుటుంబాలు జిల్లాలోని టికిరి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కాసీపూర్ సమితి టికిరి పంచాయతీ పరిధిలోని తుటిబార్ గ్రామానికి చెందిన రునా మాఝి, అభి జొడియా, గోరఖ్‌పూర్ గ్రామానికి చెందిన నాభి మాఝి, పితాజొడి గ్రామానికి చెందిన తసీల్ మాఝి, దొరాగుడ గ్రామానికి చెందిన భాస్కర జొడియాలు ఈనెల 21వ తేదీన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి ఉపాధి కోసం వెళ్లారు. ఈ క్రమంలో అనకాపల్లిలోని ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనులకు చేరారు. కంపెనీలో కెమికల్స్ కారణంగా తాము అనారోగ్యానికి గురవుతున్నామని అంతా కలిసి తిరిగి స్వగ్రామానికి చేరుకునేందుకు పయనమయ్యారు. అయితే వీరిలో రునా మాఝి, తసీల్ మాఝిలు రాయగడ స్టేషన్‌లో దిగి ఎటువెళ్లారో తెలియకపోవడంతో తోటి స్నేహితులు తమ గ్రామానికి వెళ్లి విషయాన్ని తెలియజేశారు. దీంతో బాధిత కుటుంబీకులు ఈ మేరకు వారి ఆచూకీ తెలపాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.

వలస కార్మికుల ఆచూకీ తెలపండి