
1078 తాబేళ్లు పట్టివేత : ముగ్గురు అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు ప్రాంతంలో అటవీశాఖ అధికారులు బుధవారం ఉదయం వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బోలోరా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 1078 తాబేళ్లను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లా అటవీ అధికారి సాయికిరణ్‌కు మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తాబేళ్లను అక్రమంగా రవాణ చేస్తున్నట్టు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆయన మంగళవారం రాత్రి రెండు బృందాలుగా సిబ్బందిని కేటాయించి నిఘా పెట్టించారు. ఒక బృందం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమ జిల్లా కుంట వంతెన వద్ద, మరో బృందం మోటు వంతెన వద్ద పెట్రోలింగ్‌కు పంపారు. బుధవారం ఉదయం కుంట వంతెన వద్ద అటవీశాఖ సిబ్బంది ఓ బోలోరా వాహనం అతివేగంగా రావడంతో అనుమానించి దాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో తాబేళ్లు ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మోటు అటవీశాఖ కార్యాలయం వద్ద అటవీ రేంజర్ మురళీధర్ అనుగోలియా పట్టుబడ్డ తాబేళ్లను లెక్కించగా 1078 ఉన్నట్టు గుర్తించారు. వీటిలో 910 బతికి ఉండగా.. 168 మృతి చెందాయి. అలాగే ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సుకుమ జిల్లా ధోరణాపాల్ గ్రామానికి చెందిన చంద్రదేవ్, కలిమెల సమితి యంవీ 79 గ్రామానికి చెందిన సుకుమార్ తరప్టార్, విశ్వనాఽథ్ మండాల్‌గా గుర్తించారు. వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని రేంజర్ మురళీధర్ అనుగోలియా చెప్పారు. తాబేళ్లను యం.పి.వి.65 గ్రామానికి తరలిస్తున్నట్టు నిందితులు చెప్పారన్నారు. వీటిని సంతల్లో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్టు పేర్కొన్నారు.

1078 తాబేళ్లు పట్టివేత : ముగ్గురు అరెస్టు