భువనేశ్వర్: గవర్నర్ కంభంపాటి హరిబాబు, సీఎం మోహన్ చరణ్ మాఝి రాజ్‌భవన్‌లో సోమవారం సమావేశమయ్యారు. వీరి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర పాలన వ్యవహారాలు, అభివృద్ధి ప్రణాళిక, ప్రజా సంక్షేమాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇరువురి మధ్య హృదయపూర్వకంగా చర్చ సాగినట్లు గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటి తెలిపారు. పూరీ శ్రీ జగన్నాథుని రథ యాత్రలో తొక్కిసలాట, బాలాసోర్ ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల విద్యార్థిని ఆత్మాహుతి మరణం, పూరీ బొలొంగా ప్రాంతంలో మైనరు బాలికకు నిప్పు అంటించిన సంఘటనలు ప్రభుత్వానికి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల పట్ల ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. తాజాగా సోమ వారం విపక్ష బిజూ జనతా దళ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీసీ కార్యాలయాల ఆవరణలో నిరసన సభలు నిర్వహించి గవర్నరు జోక్యం కోసం అభ్యర్థన పత్రాలు అందజేశారు. ఈ పరిస్థితుల్లో గవర్నరు, ముఖ్యమంత్రి ఆకస్మిక సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో వీరివురు సమావేశమై ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.