
● కడతేరని కష్టం
భువనేశ్వర్: ఆత్మహత్యతో కన్ను మూసిన కూతురి మరణంతో క్షోభిస్తున్న తండ్రికి కష్టం రెట్టింపు చేసిన అమానుష సంఘటన వెలుగు చూసింది. బాలాసోర్ జిల్లా దెవులొ పంచాయతీ బింధాని సాహి ప్రాంతంలో మధు బింధాని అనే వ్యక్తి బీద గిరిజనుడు. అతని కుమార్తె ఆత్మహత్యతో ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలియడంతో బలియాపాల్ ఠాణా పోలీసులు ఘటనా స్థలం చేరి లాంఛనంగా కార్యకలాపాలు ముగించి తదుపరి పరీక్షల కోసం శవాన్ని ఆస్పత్రికి తరలించాలని ఆదేశించి తప్పుకున్నారు. కానీ కన్నబిడ్డ మృతదేహం రవాణాకు చేతిలో చిల్లి గవ్వ లేక ట్రాలీ రిక్షాపై కూతురు శవాన్ని ఉంచి కన్నీటి భారంతో 6 కిలో మీటర్ల దూరంలో ఉన్న బలియాపాల్ ఆస్పత్రి వరకు రిక్షాని లాగుకుంటూ పోయిన సంఘటన సర్వత్రా ఆవేదన కలిగించింది.