
పోలీసుల సాయంతో కుటుంబం చెంతకు తల్లి
భువనేశ్వర్: పూరీ తీర్థ యాత్రకు విచ్చేసిన కుటుంబం నుంచి 68 ఏళ్ల వృద్ధ మహిళ తప్పిపోయింది. స్థానిక పోలీసులు చొరవ కల్పించుకుని తప్పిపోయిన వృద్ధ మహిళని కుటుంబీకులకు భద్రంగా అప్పగించారు. తప్పిపోయిన వృద్ధ మహిళ శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సోంపేట గ్రామస్తురాలు 68 ఏళ్ల పొందూరు వజ్రం. ఈ నెల 17వ తేదీ గురువారం శ్రీ మందిరం సందర్శించారు. దర్శనం తర్వాత లోపలి ప్రాకారంలో ఉత్తర ద్వారం పరిసరాల్లో కుటుంబం నుంచి వృద్ధ మహిళ విడిపోయింది. ఇతర కుటుంబీకులు గుర్తించే సరికి ఆమె జాడ కనుమరుగై పోయింది. శ్రీ మందిరం నలు వైపులు, సాగర తీరం తదితర పర్యాటక ప్రాధాన్య ప్రాంతాల్లో కటుంబీకులు గాలించినా జాడ కనిపించలేదు. ఈ విషయమై పూరీ సింహ ద్వారం ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు దాఖలు చేసిన వివరాలు ఆధారంగా తప్పి పోయిన మహిళ కోసం గాలించిన పోలీసులు వృద్ధురాల్ని గుర్తించి ఈ నెల 18 శుక్రవారం సురక్షితంగా అప్పగించారు. రద్దీ, కొత్త ప్రాంతాల్లో వృద్ధులు, పిల్లల పట్ల నిర్లక్ష్యం తగదని పోలీసులు హితవు పలికి సాగనంపారు.
11 తాబేళ్ల పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి అటవీ శాఖ వారు శుక్రవారం ఓ వ్యక్తి నుంచి 11 తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎంపీవీ గ్రామంలో అక్రమంగా తాబేళ్లు విక్రయిస్తున్నట్లు కలిమెల అటవీ శాఖకు ముందస్తు సమాచారం రావడంతో శుక్రవారం ఉదయం అటవీ శాఖ వారు ఎంపీవీ 11 గ్రామంలో మిధున్ బేపారి అనే వ్యక్తి ఇంటిపై దాడి చేయగా వారి రాకను గమనించిన మిథున్ తాబేళ్లను బాత్రూమ్‌లో గోనెల సంచిలో చుట్టి దాచాడు. తనిఖీలో బాత్‌రూమ్‌లో ఉన్న తాబేళ్లను స్వాధీనం చేసుకుని మిథున్‌ను అరెస్టు చేశారు.
చోరీ కేసులో నిందితుడు అరెస్టు
జయపురం: పట్టణంలోని ఎంజీ రోడ్డులో సాయిబాబా మందిరం పక్కనున్న బ్యాటరీ దుకాణంలో రూ.4 లక్షల నగదు, బంగారు నగలు దొంగతనం కేసులో ప్రధాన నిందితుడిని పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడు ఛొటగుడకు చెందిన గుప్త దాస్‌గా గుర్తించారు. దొంగతనం జరిగిన రూ.4 లక్షల్లో అతడి వద్ద నుంచి రూ.25 వేలు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ పోలీసు అధికారి ఎస్‌ఐ సిద్ధాంత బెహర వెల్లడించారు. నిందితుడు గుప్త దాస్‌పై 30కి పైగా దొంగతనాలు, దోపిడీలు మొదలగు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. గత జూన్ 29వ తేదీ రాత్రి దుకాణం గోడకు కన్నంపెట్టి రూ.4 లక్షలతో పాటు బంగారం, వెండి నగలు దొంగిలించాడని తెలియజేశారు. ఈ కేసులో ఇటీవల నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద రూ.70 వేల నగదు స్వాధీనం చేసుకున్న విషయం గుర్తు చేశారు. వీరిని విచారించి చోరీ సొత్తును రికవరీ చేయనున్నట్లు వెల్లడించారు.
రెండు బైక్‌లు ఢీ : ఇద్దరు దుర్మరణం
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ సమితి పోలీసు స్టేషన్ పరిధి సుర్లి గ్రామం జాతీయ రహదారిలో గురువారం రాత్రి ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు మోటారు బైక్‌లు ఢీకొనటంతో ఇద్దరు సంఘటన ప్రాంతంలోనే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న కొట్‌పాడ్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేసుకొని క్షతగాత్రులను వెంటనే కొట్‌పాడ్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. మరణించిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి పంపించారు. మరణించిన ఇద్దరిలో ఒకరు కొట్‌పాడ్ ఝొడిగుడ గ్రామం బైద్యనాథ్ గున్త, మరొకరు చత్తీస్‌గఢ్ రాష్ట్ర వాసి రఘునాథ్ భొలిగా గుర్తించారు. గాయపడిన ఇద్దిరిలో ఒకరు ఝొడిగుడ గ్రామం మొణిరాం పూజారి, మరొకరు చత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజారాం బాగెల్ అని పోలీసులు తెలిపారు.

పోలీసుల సాయంతో కుటుంబం చెంతకు తల్లి