
అమ్మవార్లకు ఆషాడం సారె
రాయగడ: పట్టణంలోని గ్రామ దేవత బురదల పోలమ్మ, ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం మజ్జి గౌర మ్మ అమ్మవార్లకు పట్టణ ప్రజలు ఆషాడ మాసం సారెను శుక్రవారం సమర్పించారు. ఆషాడ మాసంలో ఆడబిడ్డలను సారె సమర్పిస్తుంటారు కాబట్టి, అమ్మవార్లను తమ ఇంటి ఆడ బిడ్డలుగా భావించి గత మూడేళ్లుగా ఆషాడ మాసం సారెను సమర్పిస్తూ ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. రాణిగుడఫారం, కస్తూరీనగర్, బుదరావలస తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు ఆదివాసీ సాంప్రదాయ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వచ్చి అమ్మవార్లకు సారెను సమర్పించారు. పసుపు, కుంకుమ, గాజులతో పాటు 108 రకాల పిండి వంటలను అమ్మవారికి అందజేశారు. మజ్జిగౌరమ్మ అమ్మవారి మందిరంలో తీసుకువచ్చిన పిండి వంటలను అమ్మవారి ముందర పెట్టారు. ఆలయ ప్రధాన పూజారి చంద్రశేఖర్ బెరుకో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం తీసుకొచ్చిన సారెను అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా అందజేశారు.

అమ్మవార్లకు ఆషాడం సారె