
‘వందే భారత్’ను కొరాపుట్ వరకు నడపాలి
జయపురం:
భువనేశ్వర్–విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కొరాపుట్ వరకు పొడిగించాలని ఉత్కళ సమ్మిళిణీ కొరాపుట్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు రాసిన లేఖను విశాఖపట్నం రైల్వే డివిజన్ రెవెన్యూ మేనేజర్ ప్రవీణ కుమార్, ఏడీఆర్‌ఎం ఇ.శాంతారామ్‌లకు అందజేశారు. శుక్రవారం జయపురం రైల్వే స్టేషన్‌ను సందర్శించిన సమయంలో ఉత్కళ సమ్మిళిణీ కొరాపుట్ జిల్లా ప్రతినిధులు అధికారులకు లేఖను అందించారు. భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను అరుకు మీదుగా కొరాపుట్ వరకు నడపాలని విజ్ఞప్తి చేశారు. అందువలన మారుమూల ప్రాంతమైన బహుళ ఆదివాసీ ప్రాంత ప్రజలు భువనేశ్వర్ వెళ్లేందుకు అధిక సౌకర్యం కలుగుతుందని వారు వినతి పత్రంలో వివరించారు. కొరాపుట్ జిల్లా నుంచి రాష్ట్ర రాజధానికి ఒకే ఒక రైలు ఉందని ఆ ట్రైన్ ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చలేక పోతుందన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు వైద్య, విద్యా సౌకర్యాలు, వాణిజ్య, వ్యాపారాల కోసం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలపైన ఆధారపడుతున్నారన్నారు. అందువల్ల రైల్వే సౌకర్యలు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వందే భారత్ రైలు 800 కిలోమీటర్ల పరిధిలో గల పట్టణాలలో నడుస్తుందన్నార. అయితే భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం కేవలం 215 కిలోమీటర్ల దూరమని.. విశాఖపట్నం నుంచి అరుకు మీదుగా కొరాపుట్ వరకు నడిపితే 442 కిలోమీటర్లని వివరించారు. ఈ దూరాన్ని ఐదు గంటల్లోపే వందే భారత్ రైలుకు పడుతుందని వినతి పత్రంలో వివరించారు. వందే భారత్ రైలు నంబర్ 20841 భువనేశ్వర్ నుంచి కొరాపుట్ వరకు నడిపితే కేవలం 657 కిలోమీటర్లు అని ఈ దూరాన్ని చేరేందుకు తొమ్మిది గంటలు పడుతుందని పేర్కొన్నారు. కొరాపుట్ వరకు వందేభారత్ రైలును పొడిగిస్తే ఈ ప్రాంత ప్రజల ఆర్థిక సామాజిక ప్రగతికి దోహదపడిన వారౌతారని వెల్లడించారు. రైల్వే అధికారులకు మెమోరాండం అందజేసిన వారిలో ఉత్కళ సమ్మిళిణీ జిల్లా అధ్యక్షులు మదన మోహన నాయిక్, ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్ గౌప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస బాలా రాయ్, కార్యదర్శి నవీణ మదళ ఉన్నారు.
ప్రధానమంత్రికి ఉత్కళ సమ్మిళిణీ శాఖ లేఖ