
ఏఎన్‌ఎం దారుణ హత్య
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న డెప్పాగుడ గ్రామానికి చెందిన శైలేంద్రీ సరక (35) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యింది. సొంత బావ ఆమెను మరణాయుధంతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం కల్యాణ సింగుపూర్ పోలీసుస్టేషన్‌లో తన మరదలను తానే హత్య చేశానంటూ లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సమితిలోని ధమునిపొంగ పంచాయతీ పరిధి డెప్పాగుడ గ్రామంలో భైమాఝి ప్రేపక, శైలేంద్రీ భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరిలో భార్య శైలేంద్రీ ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తుండగా, భర్త భైమాఝి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో భైమాఝికి, అతడి అన్నయ్య లొత్ర మాఝికి కొన్నాళ్లుగా భూ తగాదాలు కొనసాగుతున్నాయి. గురువారం ఇద్దరూ మరోసారి ఘర్షణ పడ్డారు. శుక్రవారం భైమాఝి పొలానికి వెళ్లడం గుర్తించిన లొత్ర మాఝి ఇంట్లో తన మరదలు ఒక్కరే ఉండడం గమనించి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో వంటపని చేసుకుంటున్న శైలేంద్రీ తలపై మరణాయుధంతో దాడిచేసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాత గ్రామంలోకి వెళ్లి తన తమ్ముడు భార్యను తానే హత్య చేశానంటూ చెప్పుకుని పోలీసుస్టేషన్‌కు వెళ్లిపోయాడు. ఈ సమాచారాన్ని భైమాఝికి గ్రామస్తులు తెలియజేయడంతో పరుగున వచ్చి రక్తపు మడుగులో ఉన్న భార్యను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
పోలీసుస్టేషన్‌లో లొంగిపోయిన
నిందితుడు
కుటుంబ కలహాలే కారణమని వెల్లడి

ఏఎన్‌ఎం దారుణ హత్య