
బాలికల విద్యాలయం తనిఖీ
కొరాపుట్: కొరాపుట్ జిల్లా బందుగాం సమితి నీలవడిలోని ప్రభుత్వ బాలికల విద్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత గురువారం ఆకస్మికంగా తణిఖీ చేశారు. మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో ఎంఎల్‌ఎ ఆకస్మిక సందర్శన ప్రాధాన్యతను సంతరించుకుంది. విద్యాలయం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రత, వసతులు, మౌలిక సదుపాయాలను విద్యార్థినులను అడిగి తెలసుకున్నారు. బోధన, తరగతి గదిలో పరిస్థితిపై ఆరా తీశారు. విద్యా పురోగతి తెలుసుకోవడం కోసం పాఠాలు బోధించారు. బాగా చదువుకోవాలని, ఏవైనా సమస్యలు వస్తే తనకు ఫోన్ చేయాలని భరోసా ఇచ్చారు. ప్రాంగణం లోనికి అనుమతి లేకుండా అపరిచిత వ్యక్తులు వస్తే పోలీసులకు తక్షణ సమాచారం ఇవ్వాలని సూచించారు.