
ప్రయాణికుల రైళ్లు పునరుద్ధరించాలని వినతి
కొరాపుట్: కొరాపుట్–జయపూర్ మధ్య ప్రయాణికుల రైళ్లను పునరుద్ధరించాలని జయపూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అధ్యక్షుడు వి.ప్రభాకర్ రైల్వే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ నెల 2న జయపూర్–కొరాపుట్ మధ్య మట్టి చరియలు ట్రాక్‌పైకి రావడంతో రైళ్లను నిలిపివేశారని చెప్పారు. రైల్వే సిబ్బంది ఆరో తేదీ నాటికే మార్గం సుగమం చేసినా కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయని తెలిపారు. ప్రయాణికుల రైళ్లు కొరాపుట్ నుంచి వెనుదిరుగుతున్నాయని పేర్కొన్నారు. విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా, రౌర్కెలా రైళ్లు కొరాపుట్ వరకే నడుస్తున్నాయని తెలిపారు. సమీప ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జగదల్‌పూర్‌తో పాటు కొట్‌పాడ్, జయపూర్ స్టేషన్లలో రైళ్లు ఎక్కాల్సిన ప్రయాణికులు కొరాపుట్ రోడ్డు మార్గాన వెళ్లాల్సి వస్తోందన్నారు. కొరాపుట్‌లో దిగిన వారు కిరండోల్ వరకు ట్యాక్సీలో వెళ్తే రూ.5000 వరకు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కొరాపుట్ నుంచి కిరండోల్ వరకు యధావిధిగా రైళ్లు నడపాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలను వాల్తేర్ డీఆర్‌ఎం, ఈస్ట్‌కోస్ట్ జీఎం, ఎంపీ సప్తగిరి ఉల్క, రైల్వే మంత్రి అశ్వినీ శ్రీ వైష్ణవ్‌లకు పంపించారు.