
వైద్య శిబిరం ఏర్పాటు
టెక్కలి రూరల్: గూడెం పంచాయతీ సన్యాసి నీలాపురంలో బుధవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ‘నీలాపురంలో జ్వరాలు’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్లి బావులు, రోడ్డుకు ఇరువైపులా క్లోరినేషన్ చేయించారు. లింగాలవలస పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ పవన్‌తేజ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. రక్తపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ఆన్‌లైన్ గేమ్స్‌లో
నష్టపోయి వ్యక్తి ఆత్మహత్య
హిరమండలం: గులుమూరు గ్రామానికి చెందిన మజ్జి బుజ్జి (40)గడ్డిమందు తాగి బుధవారం మృతిచెందాడు. హిరమండలం ఎస్సై ఎండీ యాసీన్ తెలిపిన వివరాల ప్రకారం.. బుజ్జి హిరమండలంలోని టాటా ప్లాంట్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తుండేవాడు. ఆన్‌లైన్ గేమ్స్‌లో నష్టపోయి అప్పుల పాలయ్యాడు. మానసిక ఒత్తిడికి గురై మనస్థాపం చెంది మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. భార్య భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు.
కారుణ్య నియామకాలకు కౌన్సెలింగ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు పొందుతున్న వారు సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమవేశ మందిరంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో విధి నిర్వహణలో ఉంటూ మృతి చెందిన వారి కుటుంబ వారసులకు కారుణ్య నియామకాల కౌన్సెలింగ్ చేపట్టారు. 42 మంది అభ్యర్థులు హాజరుకాగా రోస్టర్, రిజర్వేషన్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని 32 మందికి నియామక పత్రాలు అందజేశారు. వీరిలో 24 మంది టైపిస్టులు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు ఆఫీస్ సబార్టినేట్లు ఉన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ ఎం.వి.సూర్యనారాయణ, డీటీ ఢిల్లేశ్వరరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యమే ప్రాణం తీసింది
అరసవల్లి: కుక్క కాటు వేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మురపాకలో 24 ఏళ్ల కుర్రాడు మృతిచెందినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనిత బుధవారం తెలిపారు. ఏప్రిల్ 18న కుక్క కాటుకు గురైతే వ్యాక్సిన్ వేసుకోకుండా నిర్లక్ష్యం వహించాడని పేర్కొన్నారు. ఎవరైనా కుక్కకాటు బారిన పడితే కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని స్పష్టం చేశారు. మురపాక పీహెచ్‌సీ ఈ కేసు రిపోర్టు కాలేదన్నారు. జిల్లాలో అన్ని పీహెచ్‌సీల్లో ఏఆర్‌వీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
సిక్కోలు వేదికగా రాష్ట్రస్థాయి చెస్‌పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలోని పీఎన్ కాలనీలో ఉన్న న్యూ సెంట్రల్ స్కూల్ వేదికగా ఈ నెల 20న రాష్ట్రస్థాయి స్కూల్స్ ర్యాంకింగ్ చెస్ పోటీలు జరగనున్నాయని ఆలిండియా చదరంగ సమాఖ్య చెస్ ఇన్ స్కూల్స్ కమిటీ సభ్యుడు సనపల భీమారావు బుధవారం తెలిపారు. వివిధ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వారి ప్రావీణ్యతను పరీక్షించుకోవచ్చన్నారు. 6 నుంచి 16 ఏళ్ల బాలబాలికలకు 12 కేటగిరీల్లో పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ముందుగా ఏపీచెస్.ఓఆర్జీ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని. పూర్తి వివరాలకు 9912559735 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
సారా ప్యాకెట్లు స్వాధీనం
కంచిలి: అరవ సరియాపల్లి గ్రామానికి చెందిన బొండాడ మోహిని అనే మహిళ నాటుసారా అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సోంపేట ఎకై ్సజ్ సీఐ జి.వి. రమణ సిబ్బందితో కలిసి బుధవారం దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె 80 సారా ప్యాకెట్లను విడిచిపెట్టి పారిపోయింది. వాటిని స్వాధీనపర్చుకొని మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మూడు, అంతకంటే ఎక్కువ కేసులు ఉంటే వారిపై పి.డి.యాక్టు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఈ దాడుల్లో సీఐతో పాటు కానిస్టేబుళ్లు మార్కారావు, భానుప్రసాద్, ఉమాపతి పాల్గొన్నారు.

వైద్య శిబిరం ఏర్పాటు