
ప్రజాస్వామ్య హక్కు
న్యాయ పోరాటం..
భువనేశ్వర్: న్యాయం కోసం పోరాడడం ప్రజల ప్రజాస్వామ్య హక్కు. ఈ హక్కుని రాష్ట్ర పోలీసులు నిర్దాక్షిణ్యంగా కాలరాశారు. బాలాసోర్ ఫకీర్ మోహన్ కళాశాలలో 20 ఏళ్ల యువతి ఆత్మాహుతి మృతి పట్ల బిజూ జనతా దళ్ ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కొనసాగిస్తుండగా.. పోలీసులు రబ్బరు తూటాల్ని ప్రయోగిం అన్యాయంగా గాయపరిచారని విపక్ష నేత, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య నిరసన హక్కు తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందన్నారు. అవాంఛనీయంగా రబ్బరు తూటాలతో దాడికి పోలీసులు తొందరపడ్డారని వ్యాఖ్యానించారు. బీజేడీ ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళన కొనసాగుతుండగా పోలీసులు స్పష్టంగా పక్షపాత ధోరణితో వ్యవహరించారు. అధిక బలప్రయోగంతో రబ్బరు తూటాలతో ఆందోళనకారుల్ని గాయపరచడాన్ని తీవ్రంగా ఖండించినట్లు పేర్కొన్నారు. ఈ చర్య ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతికూల పరిస్థితుల్ని ప్రేరేపిస్తుందని సూచించారు. ఇటీవల ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ఒక సీనియర్ ఐసీఎస్ అధికారి తన బలగాలకు నిరసనకారుల కాళ్లు విరగ్గొట్టమని, ఈ ఘనత సాధించిన వారికి అవార్డులు ఇస్తామని హామీ ఇస్తున్నట్లు సీసీటీవీ కెమెరా రికార్డింగ్ బట్టబయలు చేసిందని నవీన్ వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన ఆందోళనలో ఇద్దరు మాజీ మంత్రుల కాళ్లు విరగొట్టారు. వీరివురికి శస్త్రచికిత్స అవసరం ఉంటుందని భావిస్తున్నారు. పలువురు సీనియర్ నాయకులు, ఒక మహిళా రాజ్యసభ సభ్యురాలు, అనేక మంది పార్టీ కార్యకర్తలను పోలీసులు దారుణంగా కొట్టారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని నవీన్ పట్నాయక్ కోరారు.
నవీన్ పట్నాయక్