
నేడు పర్లాకిమిడిలో బంద్
పర్లాకిమిడి: ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని మృత్యువాత పడిన సంఘటనను ఖండిస్తూ గురువారం గజపతి జిల్లా బంద్‌కు కాంగ్రెస్, వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు పట్టణంలో బంద్‌కు వ్యాపార సంస్థలు, ప్రైవేటు బస్సులు సహకరించాలని ఆటో ద్వారా ప్రచారం చేశారు.
కంప్యూటర్ అకౌంటెన్సీ కోర్సులో శిక్షణ
రణస్థలం: ఎచ్చెర్ల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న కంప్యూటర్ అకౌంటెన్సీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ ఎన్.రామ్‌జీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పదో తరగతి చదివిన, 19 నుంచి 45 ఏళ్ల బీపీఎల్ కేటగిరి మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. 38 రోజులపాటు నిర్వహించే ఈ శిక్షణలో ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామని, పూర్తి వివరాలకు 77021 80537 నంబరును సంప్రదించాలని కోరారు.
బాలింత మృతితో ఆందోళన
శ్రీకాకుళం క్రైమ్ : నగరంలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో బుధవారం వేకువఝామున బాలింత చనిపోవడంతో ఆమె కుటుంబీకులు, బంధువులు ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురం కొత్తపుట్టుగ గ్రామానికి చెందిన నర్తు హైమావతి (25) ఐదారేళ్లుగా పిల్లలు కలగకపోవడంతో శ్రీకాకుళం నగరానికి చెందిన, రాజకీయాల్లో ఉన్న ప్రముఖ వైద్యుడు వద్ద మందులు వాడుతోంది. భర్త విదేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లినా.. పిల్లలు కలగాలనే ఆపేక్షతో గ్రామానికి పలుమార్లు వచ్చి భార్య చికిత్స కోసం నెలకు రూ.50 వేలకు మించి ఖర్చు చేసేవారు. ఈ క్రమంలో ఈ నెల 14న హైమావతి బాబుకు జన్మనిచ్చింది. ఈ నెల 15 సాయంత్రం వరకు హైమావతి బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఒక్కసారిగా యూరిన్ ఆగిపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. మంగళవారం రాత్రి 11 దాటాక చనిపోయింది. శస్త్రచికిత్స వికటించడం వల్లే ఇలా జరిగిందని.. అయినప్పటికీ వైద్యులు బుధవారం వేకువఝామున చనిపోయినట్లు ధృవీకరించినట్లు బంధువులు ఆరోపించారు. ఈ మేరకు ఆందోళన చేయడంతో వైద్యుడు చర్చలు జరిపి రాజీ చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అప్పటికే పోలీసులకు సమాచారమందినా సెటిల్మెంట్ కావడంతో వారూ వెనుదిరగాల్సివచ్చింది.