
భువనేశ్వర్ మెట్రో రైలు ప్రాజెక్టులో కదలిక
భువనేశ్వర్: మరుగున పడిన భువనేశ్వర్ మెట్రో రైలు ప్రాజెక్టులో కదలిక ఆరంభమైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్ దేవ్ అధ్యక్షతన బుధవారం స్థానిక లోక్ సేవా భవన్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రాజెక్టు పురోగతిపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశం తీర్మానం మేరకు ప్రాజెక్టు కార్యాచరణ కొనసాగించేందుకు ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్ అధ్యక్షతన అంతర్ మంత్రిత్వ ఉప సంఘం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో భువనేశ్వర్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో పెరుగుతున్న వాహన రద్దీ నివారణ, నియంత్రణ దృష్ట్యా మెట్రో రైలు ప్రాజెక్టు అవసరమని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అస్పష్టమైన కారణాలతో ఈ ప్రాజెక్టు మరుగున పడింది. అంతర్ మంత్రి మండలి దీనిపై చొరవ కల్పించుకుని ముందకు సాగించాలని నిర్ణయించడం విశేషం. ఈ సమావేశంలో మంత్రులు సంపద్ చంద్ర స్వంయి, పృథ్వీరాజ్ హరిచందన్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ సీఈఓ కళ్యాణ్ పట్నాయక్, సీనియర్ అధికారులు వికాష్ కుమార్, ప్రమిత్ గర్గ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.