
పొట్టంగిలో ఎంపీ బలభద్ర మజ్జి పర్యటన
కొరాపుట్: జిల్లాలోని పొట్టంగి నియోజకవర్గంలో నబరంగ్‌పూర్ ఎంపీ బలభద్ర మజ్జి మంగళవారం పర్యటించారు. పొట్టంగిలో పవిత్ర అగ్ని గంగమ్మ దేవాలయం దర్శించుకున్నారు. అక్కడ పునః నిర్మితమవుతున్న దేవాలయ పనులు పరిశీలించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు సుంకిలో బీజేపీ కార్యాకర్తలతో సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఆ ప్రాంతంలో పలువురు కార్యకర్తల నివాసాలను సందర్శించారు.
బీజేడీ వర్గ విభేదాల్లో మునిగిపోయింది
కొరాపుట్: ప్రతిపక్ష బీజేడీ పార్టీ వర్గ విభేదాల్లో మునిగిపోయిందని బీజేపీ యువమొర్చ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు కనుదాస్ విమర్శించారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని సర్క్యూట్ హౌస్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. నబరంగ్‌పూర్ జిల్లా నందాహండి సమితిలో గత మూడేళ్లలో రూ.12 కోట్ల అవినీతి జరిగిందని బీజేడీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జి విమర్శించిన విషయం గుర్తు చేశారు. ఆ ఆరోపణ జరిగిన తర్వాత రోజే అదే పార్టీకి చెందిన సమితి చైర్మన్, ఇతర సభ్యులు అసలు అవినీతి జరగలేదని కలెక్టర్‌కి నివేధించిన విషయం గుర్తు చేశారు. ఒకరు అవినీతి జరిగిందంటే మరొకరు జరగలేదని ఒకే పార్టీ నాయకులు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ పరిణామంతో ఆ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కుంజదాస్, మాజీ అధ్యక్షుడు జగదీష్ బిసోయి, దేవదాస్ మహాంకుడో తదితరులు పాల్గొన్నారు.
చోరీ కేసుల్లో ఐదుగురు అరెస్టు
రాయగడ: రెండు దొంగతనాల కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్టు చందిలి పొలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో జేకేపూర్ అరవింగనగర్, నువాపడ వీధులకు చెందిన మూస ఒరఫ్ అర్జన్ మినియాక, రాహుల్ ధన్‌బాద్, జొగ ఒరఫ్ రవీంద్ర గౌడొ, సురత్ కొండ, మనొజ్ దుర్గలు ఉన్నారు. నిందితుల నుంచి ఎల్‌ఈడీ టీవీ, రెండు మోటార్లు, మూడు వంట గ్యాస్ సిలిండర్లు, ఇత్తడి విగ్రహం, రెండు ఫ్యాన్లతో పాటు 4060 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చందిలి పోలీస్ స్టేషన్ ఐఐసీ ఉత్తమ్ ముమార్ సాహు బుధవారం తెలిపారు. గత నెల 12, 13 తేదీల్లో చందిలి పోలీస్ స్టేషన్ పరిధి జేకేపూర్‌లోని రెండు ప్రాంతాల్లో చోరీ జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేసి నిందితులను సోమవారం సాయంత్రం పట్టుకున్నారు. అనంతరం కోర్టుకు తరలించారు.
ఎయిమ్స్ ఆవరణలో
ఆందోళన
భువనేశ్వర్: బాలాసోర్ ఫకీర్ మోహన్ కళాశాల విద్యార్థిని సౌమ్యశ్రీ మరణం తర్వాత శవ పరీక్షలు రాత్రికి రాత్రి ముగించి అడ్డగోలుగా తరలిస్తున్నారని దుమారం రేగింది. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత ఆస్పత్రుల్లో శవ పరీక్షలు నిర్వహించడం జరగదు. సౌమ్యశ్రీ విషయంలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఎదురు కావడంతో యువజన, విద్యార్థి కాంగ్రెస్ వర్గాలు ఆకస్మిక ఆందోళనకు దిగాయి. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆవరణలో ఆచార విరుద్ధ చర్యల్ని ఖండించారు. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణకు దిగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు