
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మన్మోహన్ సామల్
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మన్మోహన్ సామల్ మరోమారు ఎన్నిక అయ్యారు. మంగళవారం ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర శాఖ సంస్థాగత ఎన్నికల వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన బీజేపీ కేంద్ర నాయకుడు సంజయ్ జైస్వాల్ ప్రకటన చేశారు. ప్రకటన వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, మంత్రి వర్గం, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పండా, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు , సీనియర్ కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యాలయంలో వరుసగా నాలుగోసారి ఎన్నికై న మన్మోహన్ సామల్‌ను సత్కరించారు. రాష్ట్రంలో పార్టీ అత్యున్నత స్థానంలో ఇది ఆయన వరుసగా రెండు, సమగ్రంగా నాల్గో పర్యాయం ఈ హోదాకు ఎన్నిక కావడం విశేషం. గతంలో 1999, 2001లో బిజూ జనతా దళ్ (బీజేడీ)తో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ సమయంలో ఆయన ఈ పదవికి ఎన్నికయ్యారు. 2023 మార్చిలో మరోసారి రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఎన్నిక అయ్యారు. ఈ వ్యవధిలో 2024 సార్వత్రి ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్ని చేజిక్కించిన ఘనత సొంతం చేసుకున్నారు. రాష్ట్రం నుంచి అత్యధికంగా 20 లోక్ సభ స్థానాలను పార్టీ కై వసం చేసుకుంది. 2024 ఎన్నికల్లో ప్రతిపాదిత బీజేడీతో పొత్తును నిరాకరించి ఒంటరిగా పోరాడటానికి కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి తన దక్షత, నైపుణ్యతని చాటుకున్నారు. ఆ తర్వాత జరిగిన తాజా ఎన్నికల్లో మరోసారి రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఎన్నిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.