
10 కేజీల గంజాయి స్వాధీనం
నరసన్నపేట: ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న 10 కేజీల గంజాయిని నరసన్నపేట పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు బసంత మహాపాత్రో, సిద్దాంత స్వైన్‌లను అరెస్టు చేసినట్లు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్‌తో కలిసి ఆయన తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎప్పటిలాగే మడపాం టోల్ గేట్ వద్ద నరసన్నపేట ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తదితరులు మంగళవారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో సోదాలు చేయగా వీరి వద్ద గంజాయి గుర్తించామన్నారు. వీరిద్దరూ ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా రంభ పోలీసుస్టేషన్ పరిధిలోని కొండాలి గ్రామం నుంచి అక్రమంగా గంజాయిని బెంగళూరు తరలిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. దీంతో గంజాయిని సీజ్‌చేసి, కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. గంజాయి రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.