
పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు
బూర్జ: మండలంలోని పాలవలస జెడ్పీహెచ్ స్కూల్, అల్లెన ప్రాథమికోన్నత పాఠశాలల్లో డీఈవో డాక్టర్ తిరుమల చైతన్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా పాలవలస జెడ్పీ హైస్కూల్ పరిశీలించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పనితీరుపై ఎంఈవోలు ఎన్.శ్యామసుందరరావు, బి.ధనుంజయరావులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యాబోధన ఏవిధంగా ఉందో విద్యార్థులకు ప్రశ్నలు అడిగి తెలసుకున్నారు. అల్లెన పాఠశాలలో విద్యార్థులు పాలవలస పాఠశాలలో మెర్జి చేయడంతో తల్లిదండ్రులు పంపించే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. అయితే 100 మంది విద్యార్థులు ఉంటే గానీ యూపీ స్కూల్ కొనసాగించలేమని డీఈవో పేర్కొన్నారు. ఆయనతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
హోంగార్డు కుటుంబానికి చేయూత
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసుశాఖలో హోంగార్డుగా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు పి.జగన్నాథంకు జిల్లా హోంగార్డుల యూనిట్ ఒక్కరోజు వేతనం రూ.4.09 లక్షలను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి చేతులమీదుగా అందజేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జగన్నాథంకు చెక్ అందించారు.
మా భూములు తీసుకోవద్దు
నరసన్నపేట: ఎంఎస్‌ఎంఈవో పార్క్ నిమిత్తం తమ భూములు తీసుకోవడానికి ప్రభుత్వం చూస్తోందని, తమ భూములు తీసుకోవద్దని మండలంలోని జమ్ము గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు బమ్మిడి రామారావు, తలసముద్రం రాజారావు, తాడి మొఖలింగంలతో పాటు పలువురు రైతులు రెవెన్యూ అధికారులకు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. 40 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం తమ జీవానాధారానికి భూములను ఇచ్చిందని, ఇప్పుడు ఇండస్ట్రీయల్ పార్క్ పేరిట తాము సాగు చేసి పంటలు పండించుకుంటున్న భూములు తీసుకోవడానికి అధికారులు చూస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ఇది ఏమాత్రం తగదని పేర్కొన్నారు. ఆర్‌ఐ సాయిరాంతో పాటు వీఆర్వో, సర్వేయర్లు వచ్చి సోమవారం కొలతలు వేశారన్నారు. తమ భూముల వైపు అధికారులు రావద్దని కోరారు.
‘ముప్పై ఏళ్లు టీడీపీలో కష్టపడ్డా.. గుర్తింపేదీ..?’
రణస్థలం: తాను ముప్పై ఏళ్లు టీడీపీలో కష్టపడ్డానని అయినా గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ముక్కు ఆదినారాయణ అన్నారు. మండలంలోని రావాడ పంచాయతీలో తన ఇంటి వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశానని, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేశానని చెప్పారు. ఎచ్చెర్ల నియోజకవర్గ మార్కెట్ చైర్మెన్ ఎస్సీ రిజర్వేషన్ అయిందని, అన్ని అర్హతలుండి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే తనను నామినేట్ చేయకుండా వేరేవాళ్లకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. దీనికి నిరసనగా తాను పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తానని, అలాగే టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని తెలిపారు.
విజిలెన్స్ దాడులు
రణస్థలం: మండల కేంద్రంలోని రామతీర్థాలు రహదారిలో జే.ఆర్.పురంలో ఉన్న ఎరువుల దుకాణంపై విజిలెన్స్, వ్యవసాయ అధికారులు మంగళవారం దాడులు చేపట్టారు. దీనిలో భాగంగా స్టాక్ రిజిస్టర్‌తో ఎరువుల భౌతిక నిల్వలను పోల్చితే వ్యత్యాసాలు కనిపించాయి. అలాగే అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో ఎరువులను స్వాధీనం చేసుకొని, దుకాణం డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, కానిస్టేబుల్ ఈశ్వర్, మండల వ్యవసాయ ఏవో డి.విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు

పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు

పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు