
దళిత యువకులను హింసించిన వారిని అరెస్టు చేయాలి
పర్లాకిమిడి: గంజాం జిల్లా ధరాకోట్ గ్రామంలో ఇద్దరు దళిత యువకులు గోవులను తరలిస్తున్నారని ఆరోపిస్తూ వారికి అరగుండు కొట్టి, రోడ్డుపై కూర్చోబెట్టి హింసించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని అఖిల భారత ఆదివాసీ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించి బైఠాయించారు. దళిత క్రిస్టియన్లపై భజరంగ్ దళ్ నాయకులు పాశవిక చిత్రహింసలు చేసిన వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహాన్ మఝి అరెస్టు చేయాలని, లేకుంటే జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, ఆందోళనలు చేపడతామని గజపతి జిల్లా ఆదివాసీ దళిత మంచ్ కన్వీనరు కేదార్ శోబోరో హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్‌కు ముఖ్యమంత్రి పేరిట రాసిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆందోళనలో అమోద్ బర్దన్, శ్రీనివాస బెహారా, కడుకా శబర, చుంబ్రా శోబోరో, దళిత మహాసభ నాయకులు చైతన్య లిమ్మా పాల్గొన్నారు.