
మంత్రి పరామర్శ
భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని రథయాత్రలో పూరీ శారదా బాలి ప్రాంతం తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మృతుడు ప్రేమకాంత్ మహంతి కుటుంబాన్ని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబానికి అవసరమైన అన్ని సహాయాలను అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఏడాదిగా కార్మికుల ఆందోళన
కొరాపుట్/జయపురం: జయపూర్‌లోని సేవా పేపర్ మిల్లు కార్మికులు చేపడుతున్న ఆందోళనకు ఏడాది పూర్తయ్యింది. దీంతో గగనాపూర్‌లో మిల్ ప్రధాన ద్వారం ముందు భారీ వర్షంలో మంగళవారం కార్మికులు నిరసన తెలిపారు. 2024 జులై 1వ తేదీ నుంచి ఆందోళన చేపడుతున్నట్లు కార్మిక నాయకుడు ప్రమోద్ మహంతి ప్రకటించాడు. అయినా ఇంతవరకు 2018 నుంచి రావాల్సిన వేతన బకాయిలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా మూసి ఉన్న పరిశ్రమని నమ్ముకొని ఉన్న కార్మికుల దుస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. ఈ పరిశ్రమని ఎవరు అమ్ముతున్నారో ఎవరు కొంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ మధ్యకాలంలో నాలుగు సార్లు పరిశ్రమ అమ్మకానికి గురైందన్నారు. పరిశ్రమ నడపడానికి వివిధ సమయాల్లో రూ.250 కోట్లు తీసుకున్నారు గానీ, కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా మంది కార్మికుల చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు.
నాటుసారాతో ఇద్దరు అరెస్టు
జయపురం: చట్ట వ్యతిరేకంగా నాటుసారాను అమ్మేందుకు తీసుకెళ్తున్న ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేసినట్లు జయపురం ఎకై ్సజ్ అధికారి బలరాం దాస్ తెలిపారు. అరైస్టెనవారిలో జయపురం సమితి నీలాగుడ గ్రామానికి చెందిన లక్ష్మణ నాయిక్, సునాధర కమరలు ఉన్నారు. లక్ష్మణ్ వద్ద ఒక మోటారు బైక్‌ను కూడా స్వాధీనపరచుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై కేసులు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరచామని, కోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడంతో జైలుకు తరలించామన్నారు.

మంత్రి పరామర్శ

మంత్రి పరామర్శ