
బీఎంసీ కమిషనర్‌పై దాడి
భువనేశ్వర్:
స్థానిక నగర పాలక సంస్థ (బీఎంసీ) కార్యాలయంలో అదనపు కమిషనర్‌పై అమానుష దాడి దిగ్భ్రాంతిని కలిగించింది. సోమవారం కార్యాలయంలో ప్రజాభియోగాల విచారణ కొనసాగుతున్న తరుణంలో స్థానిక 6వ నంబరు వార్డు కార్పొరేట రు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆధ్వర్యంలో అపరిచిత వ్యక్తులు విధి నిర్వహణలో ఉన్న అదనపు కమిషనర్ రత్నాకర్ సాహుపై అకస్మాత్తుగా దాడికి దిగారు. అపరిచిత వ్యక్తులతో కలిసి వార్డు కార్పొరేటరు ప్రజాభియోగాల విచారణ నిర్వహిస్తున్న అధికారిని ఈడ్చుకుంటూపోయి కాలితో తన్ని ఘోరంగా అవమానపరిచారు. ఈ సంఘటనపై సర్వత్రా విచారం వ్యక్తం అవుతుంది. నగర పాలక సంస్థ కార్యాలయంలోనికి అపరిచిత వ్యక్తులతో చొరబడి కార్పొరేటరు వ్యూహాత్మకంగా అధికారిని అవమానపరిచే రీతిలో ప్రాణాంతక దాడికి పాల్పడ్డాడు. ఈ చర్యపై నిరసనతో బీఎంసీ సిబ్బంది, కార్పొరేటర్లు ధర్నా నిర్వహించారు. నిందితుల వ్యతిరేకంగా చర్యలు చేపట్టేంత వరకు నిరసన నిరవధికంగా కొనసాగుతుందని హెచ్చరించారు. బీఎంసీ కార్యాలయం ఎదురుగా నడి రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేపట్టడంతో ప్రధాన మార్గంలో వాహన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో మేయరు, పలువురు బీజేడీ ఎమ్మెల్యేలు, ముందంజ కార్యకర్తల్ని పోలీసులు వ్యానులో తరలించారు.
నిందితులు అరెస్టు
విధి నిర్వహణలో ఉన్న నగర పాలక సంస్థ అదనపు కమిషనరుపై దాడికి పాల్పడిన ఆరోపణ కింద 3 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిలో 6వ నంబరు వార్డు కార్పొరేటరు ఉన్నాడు. అరెస్టు చేసిన వారిలో జీవన్ రౌత్, రస్మి మహాపాత్రొ మరియు దేబాశిష్ ప్రధాన్ ఉన్నట్లు స్థానిక ఖారవేళ నగర్ ఠాణా పోలీసులు తెలిపారు.