
ఉప్పొంగుతున్న నదులు
భువనేశ్వర్: జార్ఖండ్, ఉత్తర ఒడిశాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బాలాసోర్ జిల్లాలో ప్రముఖ నదులు వరదతో ఉప్పొంగుతున్నాయి. ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలతో దిగువ ప్రాంతాల నదులలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. పొరుగు జిల్లా మయూర్‌భంజ్ కూడా వరద ముంపు అంచుల్లో ఉన్నట్లు భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. బుఽఢాబలంగా, జలకా, వైతరణి వంటి ఇతర నదులు తాత్కాలికంగా ఉప్పొంగి శాంతిస్తున్నాయి. జార్ఖండ్‌లోని చండిల్ ఆనకట్ట నుంచి అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడంతో సువర్ణ రేఖ నది వరదతో ఉప్పొంగుతోంది. సువర్ణ రేఖ నదిలో నీటి మట్టం పెరుగుతుండడంతో బాలాసోర్, మయూర్‌భంజ్ జిల్లాలు వరదలతో సతమతం అవుతున్నాయి. ఉప్పొంగుతున్న నదీ తీర ప్రాంతాలకు ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. వరదల ఉధృతిని రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి అనుబంధ అధికార యంత్రాంగంతో సమావేశమై సమీక్షించారు.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం సువర్ణరేఖ, బుఽఢాబలాంగ్ నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జార్ఖండ్‌లోని పరీవాహక ప్రాంతంలో నిరంతర వర్షాలు కురుస్తున్న కారణంగా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. బాలాసోర్ జిల్లాలోని రాజ్‌ఘాట్ వద్ద సువర్ణ రేఖ నది వద్ద నీటి మట్టం ప్రమాద పరిమితి దాటిందని జల వనరుల శాఖ తెలిపింది. నీటి మట్టం 11.52 మీటర్లకు పెరిగి 10.36 మీటర్ల ప్రమాద గుర్తును అధిగమించింది. మథాని వద్ద జలకా నది నీటి మట్టం 6.84 మీటర్లు గరిష్ట పరిమితికి మించి 6.50 మీటర్ల ఎత్తున ప్రవహిస్తుంది. 5వ నంబరు జాతీయ రహదారి వద్ద బుఽఢాబలంగా నది ప్రస్తుత నీటి మట్టం 7.20 మీటర్లు కొనసాగుతుంది. ఈ నది ప్రమాద సంకేతం 8.13 మీటర్లు. ఈ పరిస్థితుల దృష్ట్యా వరద పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి హామీ ఇచ్చారు. వరద ముంపుతో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. పరిస్థితి గురించి, ముఖ్యంగా చండిల్ అసంపూర్ణ ఆనకట్ట స్థితిగతుల గురించి నిరంతరం జార్ఖండ్ ప్రభుత్వంతో సంప్రదిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నదుల ప్రవాహాన్ని యంత్రాంగం నిశితంగా పర్యవేక్షిస్తోంది. అవసరమైన చోట కట్టలను బలోపేతం చేస్తోందని మంత్రి అభయం ఇచ్చారు.
మంత్రి సమాచారం ప్రకారం బుఽఢాబలాంగ్ నది నీటి మట్టం క్రమంగా దిగజారుతుంది. సువర్ణ రేఖ నది నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుతం వర్షపాతం లేనందున ఈ రెండు నదుల్లో నీటి మట్టంలో స్వల్ప హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. అంచనా ప్రకారం వానలు కురిస్తే జలేశ్వర్, ఇతర లోతట్టు ప్రాంతాలను కొంత మేరకు ప్రభావితం చేస్తుంది. ఒడిశా ప్రభుత్వం వరద పరిస్థితిని ముందస్తుగా నిర్వహిస్తోంది, సెంట్రల్ రేంజ్ ఆర్‌డీసీ, ఇతర అధికారులు ప్రత్యక్షంగా వరద ఉధృతిని నిరంతరం సమీక్షిస్తున్నారు. వరద నీరు విడుదల నియంత్రణతో సువర్ణ రేఖ మరియు బుఽఢాబలాంగ్ నదుల నీటి మట్టం త్వరలో తగ్గుతాయని మంత్రి సురేష్ కుమార్ పూజారి అభిప్రాయం వ్యక్తం చేశారు.
రానున్న 24 గంటలు కీలకం: ఈఐసీ
ఉత్తర ఒడిశా, జార్ఖండ్‌లో భారీ వర్షపాతం నమోదవుతోంది. దీని ప్రభావంతో ఉత్తర ఒడిశాలో పెను వరద ముప్పు పొంచి ఉందని జల వనరుల శాఖ అత్యున్నత ఇంజనీర్ (ఈఐసీ) తెలిపారు. రానున్న 24 గంటలు చాలా కీలకం అన్నారు. వరద పరిస్థితి వర్షపాతంపై ఆధారపడి ఉంటుందన్నారు. సువర్ణ రేఖ, బుఢాబలంగొ మరియు జలకా 3 నదులలో నీటి మట్టం పెరిగింది, వరద పరిస్థితి పొంచి ఉంది. ఈ పరిస్థితిని అనుక్షణం సమీక్షిస్తున్నట్లు వివరించారు.
పొడి ఆహారం సరఫరా
బాధిత గ్రామాల ప్రజలకు పొడి, వండిన ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఇతర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కెంజొహర్, మయూర్‌భంజ్, బాలాసోర్‌లలో ఒడ్రాఫ్ బృందాలను మోహరించారు. సహాయక చర్యలకు మద్దతుగా కటక్ నుంచి 2 యూనిట్ల అదనపు బృందాలను బాలాసోర్‌కు పంపుతున్నారు. అగ్నిమాపక దళం అధునాతన పరికరాలతో రక్షణ, సహాయక చర్యలలో చురుకుగా పాల్గొంటోంది.

ఉప్పొంగుతున్న నదులు