
శ్రీ గుండిచాకు భక్తుల తాకిడి
భువనేశ్వర్: శ్రీ గుండిచా మందిరం భక్తుల తాకిడితో కిటకిటలాడుతోంది. అడపా మండపంపై మూల విరాటుల్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. శ్రీ మందిరం తరహాలో ఇక్కడ అన్ని సేవలు యథాతథంగా కొనసాగుతాయి. భక్తులకు మహా ప్రసాదం (అన్న భోగం) లభిస్తుంది. సోమవారం నుంచి ఈ ప్రసాదం లభ్యం అవుతుంది. అడపా మండపంపై దర్శనం తర్వాత అడపా ఒబొఢా (అన్న భోగం) ఆరగించడం కూడ పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.
శ్రీ మహాలక్ష్మి ఆగమనం
మంగళ వారం పవిత్ర హిరా పంచమి. అన్నా చెల్లెళ్లతో శ్రీ జగన్నాథుడు శ్రీ గుండిచా యాత్రకు తరలి వచ్చాడు. శ్రీ మందిరం బోసిబోయింది. శ్రీ మహాలక్ష్మి ఒంటరైంది. స్వామిని దర్శించుకునేందుకు విచ్చేస్తున్న సందర్భంగా శ్రీ గుండిచా యాత్రలో హిరా పంచమి ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీ మహాలక్ష్మి ఆగమనం పురస్కరించుకుని శ్రీ జగన్నాథుడు మరోమారు ముస్తాబయ్యేందుకు సిద్ధమయ్యాడు. పంచమి యుక్త చతుర్థి తిథి సందర్భంగా శ్రీ గుండిచా అడపా మండపంపై శ్రీ జగన్నాథునికి శ్రీ ముఖ సింగారం (బొనొకొ లగ్గి) చేశారు. తిథి ఘడియలకు అనుగుణంగా సోమవారం రాత్రి ద్వితీయ భోగ మండప సేవ అనంతరం ఈ సేవ నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ లెక్కన రాత్రి 9 గంటలకు ఆరంభించారు. సుమారు 4 గంటల సేపు సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపి వేశారు. కస్తూరి, కేసరి, కర్పూరం వంటి ప్రముఖ సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకుని శ్రీ జగన్నాథుని ముఖం ముఖం ప్రకాశవంతం అవుతుంది.
వరుస క్రమంలో దర్శనం
శ్రీ జగన్నాథుని జనన వేదికగా పేరొందిన శ్రీ గుండిచా మందిరం అడపా మండపంపై స్వామి దర్శనం విశేషత కలిగి ఉంది. రద్దీ క్రమంగా పెరుగుతుంది. భక్తులకు క్రమబద్ధమైన దర్శనానికి ఏర్పాట్లు చేశారు. తొక్కిసలాట వంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రత్యేక బారికేడ్ గుండా వరుస క్రమంలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. సోమవారం ఉదయం బొడొ సింగారం అలంకరణ తర్వాత తలుపులు తెరవడంతో సర్వ దర్శనానికి అనుమతించారు. ఉదయం 6 గంటల నుంచి ప్రతిపాదించిన సర్వ దర్శనం ఉదయం 10.10 గంటలకు ఆరంభం కావడంపై సర్వత్రా విచారం వ్యక్తం అయింది. భక్తులు బారికేడ్ గుండా శ్రీ గుండిచా సింహ ద్వారం నుంచి ప్రవేశించి నక్కొచొణా ద్వారం గుండా వెలుపలకు వచ్చేందుకు వీలుగా వరుస వ్యవస్థ ఏర్పాటు చేశారు. మంగళవారం హిరా పంచమి నాడు, శ్రీ మహా లక్ష్మీ దేవి శ్రీ గుండిచా ఆలయాన్ని సందర్శించనుంది.

శ్రీ గుండిచాకు భక్తుల తాకిడి

శ్రీ గుండిచాకు భక్తుల తాకిడి

శ్రీ గుండిచాకు భక్తుల తాకిడి