
బైక్‌ను ఢీకొట్టిన కారు
● ఒకే కుటుంబంలో ముగ్గురికి గాయాలు
కంచిలి: కంచిలిలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గాయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. బొగాబెణి పంచాయతీ జెన్నాగాయి గ్రామానికి చెందిన దుర్యోధన జెన్నా భార్య తులసి జెన్నా, మూడేళ్ల కుమారుడు ఢిల్లేశ్ జెన్నాలతో కలిసి బైక్‌పై కంచిలి బజారుకు బయలుదేరాడు. అదే సమయంలో పలాస వైపు నుంచి ఇచ్ఛాపురం వైపు వెళుతున్న కారు అతివేగంతో వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన కాలువలోకి ద్విచక్ర వాహనంతో సహా సుమారు వంద మీటర్లు ఈడ్చుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న భర్త, భార్య, బిడ్డలు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని 108 అంబులెన్స్‌లో సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కారు కవిటి మండలం ఇంటెనకపుట్టుగ గ్రామానికి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. కారు ను నిర్లక్ష్యంగా నడపటం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. గాయపడిన దుర్యోధన జెన్నా గొల్లకంచిలి గ్రామంలో నిమ్మాసినమ్మ ఆలయ పూజారిగా పనిచేస్తున్నారు. పూజా సామగ్రి కొనుగోలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కంచిలి ఏఎస్‌ఐ పి.అప్పిరెడ్డి కేసు నమోదు చేశారు.

బైక్‌ను ఢీకొట్టిన కారు