పక్షిని ఢీకొన్న ఇండిగో విమానం
భువనేశ్వర్: ఇండిగో విమానం పక్షిని ఢీకొనడంతో పైలెట్ అత్యవసర బ్రేకులు వేయాల్సి వచ్చింది. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నింగికి ఎగిరే ముందు పక్షి ఢీకొట్టింది. భువనేశ్వర్ నుంచి కోల్‌కతాకు బయల్దేరే ఇండిగో విమానం 6ఈ–6101 గురువారం ఈ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు బయట పడింది. పైలెట్ వెంటనే టేకాఫ్‌ను నిలిపి వేసి సురక్షితంగా ఉండటానికి అత్యవసర బ్రేక్‌లను వేశాడు. తక్షణమే విమానం పరిస్థితిని తనిఖీ చేశారు. ప్రయాణికులకు లేదా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ సంఘటన కారణంగా కొంతసేపు విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.
భువనేశ్వర్ విమానాశ్రయం పరిసరాల్లో అడ్డంకులు: డైరెక్టర్
విమానం గాలిలో ఎగిరేందుకు, నేలపై వాలేందుకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు అడ్డంకులు ఉన్నాయని డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ తెలిపారు. ఈ మార్గంలో పెద్ద పెద్ద చెట్లు ఎదిగి ఉన్నాయి. రన్‌వేకి స్వల్ప దూరంలోనే అక్రమంగా నిర్మితమైన ఎత్తైన భవనాలు కూడ అడ్డంకిగా పరిణమించాయని ఆయన వివరించారు. గత నెలలో జరిగిన విమానాశ్రయ పర్యావరణ నిర్వహణ కమిటీ (ఏఈఎంసీ) సమావేశంలో స్థానిక నగర పాలక సంస్థ బీఎంసీ కమిషనర్‌కు ఈ విషయం గురించి తెలియజేశారు. విమానాశ్రయంలో ఎత్తుగా ఎదిగిన చెట్లను నరికివేసి, అడ్డంకిగా నిలిచిన ఎత్తైన భవనాలను కూల్చివేయాలని విమానాశ్రయం డైరెక్టర్ ప్రసన్న బీఎంసీ అధికార వర్గాలకు వివరించారు.
ఈ నెల 30న మాక్ డ్రిల్
ఈ నెల 30వ తేదీన స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాక్ డ్రిల్ జరుగుతుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద దృష్ట్యా మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. దీని కోసం పౌర విమానయాన డైరెక్టరు జనరల్ (డీజీసీఏ) సూచనలు జారీ చేసింది. విమానాశ్రయ సిబ్బంది, పోలీసులు, వైద్య, అగ్నిమాపక సిబ్బంది ఈ కసరత్తులో పాల్గొంటారు. ప్రమాదం వంటి ఏదైనా సంఘటన జరిగితే తక్షణమే దానిని ఎదుర్కొనే సన్నద్ధతపై అనుబంధ యంత్రాంగాన్ని చైతన్యపరచడం ఈ కసరత్తు లక్ష్యగా పేర్కొన్నారు.
రవాణా రెట్టింపు అవుతుంది
స్థానిక బీపీఐఏ విమానాశ్రయంలో విమానాల రవాణా రెట్టింపు చేసే యోచనతో యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. నింగికి ఎగరడం, నేలకు వాలడం కోసం విమానాలకు మౌలిక సదుపాయాలతో అనుకూలమైన విధానం ప్రవేశ పెట్టనున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ తెలిపారు. దీనితో విమానాశ్రయం కార్యాచరణ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో మౌలిక సదుపాయాల నవీకరణతో రన్‌వే సామర్థ్యం గంటకు రెండింతలకు పెరుగుతుంది. ప్రస్తుతం గంటకు 12 విమానాల రవాణా కొనసాగుతుంది. నవీకరణతో ఈ సామర్థ్యం గంటకు 24 విమానాల వరకు పెరుగుతుంది. గతంలో విమానాలు నేలకు వాలిన తర్వాత నింగికి ఎగిరేందుకు రన్ వే గుండా వెనక్కి మలుపు తిప్పడం అనివార్యం కావడంతో ఆలస్యం జరిగేది. నవీకరణ పురస్కరించుకుని విమానాశ్రయంలో ట్రాక్‌లు విమానాలు వేగాన్ని తగ్గించకుండా రన్ వే నుంచి త్వరగా నిష్క్రమించడానికి వీలు కల్పిస్తారు. రూ. 48 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. ఇటీవల పౌర విమానయాన డైరెక్టరు జనరల్ (డీజీసీఏ) నుంచి వాస్తవ కార్యాచరణకు అనుమతి లభించింది. ఈ మార్పులకు సంబంధించి విస్తృత సమాచారం కోసం భారత దేశ ఏరోనాటికల్ ఇన్‌ఫర్మేషన్ పబ్లికేషన్ (ఏఐపీ)లో ప్రతిబింబిస్తారు. తద్వారా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికులకు మరియు విమానయాన సంస్థలకు సమాచారం అందుతుంది. భద్రతా జాగ్రత్తల దృష్ట్యా విమానాశ్రయం పరిసరాల్లో ప్రతి మూడేళ్లకు ఒకసారి అడ్డంకి పరిమితి ఉపరితలాలు (ఓఎల్‌ఎస్) సర్వే నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సురక్షితమైన కార్యాచరణ నిర్వహణ కోసం స్థానిక పౌర సంస్థలతో కలిసి విమానాశ్రయ వర్గాలు సమన్వయంతో పని చేస్తారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం విమానాశ్రయానికి సమీపంలో ఉన్న భవనాలు, చెట్ల ఎత్తును తగ్గించనున్నారు. భద్రతా చర్యలను దృష్టిలో ఉంచుకుని, పౌర విమానయాన నియమాలు 2025 ప్రకారం పౌర విమానయాన శాఖ సంబంధిత యజమానులకు తాఖీదు జారీ చేస్తుంది. పౌర విమానయాన అధికార వర్గాల తాఖీదు అందిన 60 రోజుల గడువు లోగా యజమాని ఇంటి ఎత్తును తగ్గించాల్సి ఉంటుంది. విమాన రవాణా మార్గానికి అడ్డుగా ఉన్న ఏదైనా చెట్టును వెంటనే నరికి వేస్తారు. ఈ నేపథ్యంలో ప్రభావిత ఇంటి యజమాని పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటి యజమాని నిర్ణీత సమయంలోపు భవనాలను కూల్చి వేసి ఎత్తు తగ్గించని పరిస్థితుల్లో విమానాశ్రయ అధికారి జిల్లా కలెక్టర్‌కు తెలియజేస్తారు. తదనంతరం జిల్లా కలెక్టర్ జోక్యంతో ఇల్లు, చెట్ల ఎత్తు తగ్గిస్తారు.
అత్యవసర బ్రేకుతో తప్పిన ముప్పు


