స్థానిక సంస్థలకు సాధికారత యోచన
● ముఖ్యమంత్రితో రాష్ట్ర ఆర్థిక సంఘం
సంప్రదింపులు
భువనేశ్వర్: ఆరో రాష్ట్ర ఆర్థిక సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝితో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు సాధికారత కల్పించే దిశలో ఆయన సూచనలను కోరింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఒడిశా రాష్ట్ర ఆర్థిక కమిషన్ వెబ్‌సైట్ (httpr://rfc.odirha.gov.in) ను ప్రారంభించారు. ఎన్నికై న ప్రతినిధులు, గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్‌లు, మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్‌లు, మేధావులు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, పౌర సమాజ సంస్థలు, వ్యక్తుల నుంచి సూచనలు, అభిప్రాయాలను ఆహ్వానించడానికి ఈ వెబ్‌సైట్ అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్‌లో మునుపటి, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక కమిషన్ల వివరాలు, అధ్యయన నివేదికలు మొదలైనవి పొందుపరిచారు. వీటిని ప్రజల సాధారణ సమాచారం కోసం పొందుపరిచినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ప్రభుత్వం డాక్టర్ అరుణ్ కుమార్ పాండా అధ్యక్షతన 6వ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. 6వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ డాక్టర్ అరుణ్ కుమార్ పండా, ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాశ్వత మిశ్రా, ఎలక్ట్రానిక్స్ – సాంకేతిక సమాచార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశాల్ కుమార్ దేవ్, 6వ రాష్ట్ర ఆర్థిక కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ అసిత్ రంజన్ మహంతి, ప్రొఫెసర్ అమరేష్ సామంత్రాయ్ మరియు డాక్టర్ బిభు ప్రసాద్ నాయక్, కమిషన్ సభ్య కార్యదర్శి డాక్టర్ సత్య ప్రియ రథ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1, 2026) నుంచి ఆరంభం కానున్న పంచ వర్ష ప్రణాళిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు (గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్‌లు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్‌లు) వనరుల బదిలీని కమిషన్ ప్రతిపాదించింది.


