పోలీసులకు చిక్కిన డిజిటల్ కేటుగాళ్లు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లాకేంద్రం సమీపంలోని రాగోలు జెమ్స్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న మహిళా వైద్యురాలు ప్రొఫెసర్ రేవతిని మోసగించిన డిజిటల్ కేటుగాళ్లు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. వైద్యురాలికి ఫోన్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటూ బెదిరించి సీబీఐ డిజిటల్ అరెస్టు పేరిట రూ.13.5 లక్షలకు టోకరా వేయడంతో బాధితురాలు గత నెల 14న ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి సూచనలతో డీఎస్పీ సిహెచ్ వివేకానంద పర్యవేక్షణలో సీఐ సీహెచ్ పైడపునాయుడు ఎస్‌ఐలు హరికృష్ణ, రాజేష్‌లు బృందాలుగా విడిపోయి కేసును ఛేదించారు. ఈ మేరకు డీఎస్పీ వివేకానంద శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.
వైద్యురాలికి బెదిరింపు ఫోన్‌కాల్స్‌తో..
గత నెల 14న ఉదయం పది గంటల సమయంలో వైద్యురాలికి గుర్తు తెలియని నెంబర్ల నుంచి పదే పదే ఫోన్లు వచ్చాయి. బెంగళూరులోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నామని.. మీ ఆధార్ నంబర్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్‌కు హ్యూమన్ ట్రాఫికింగ్(మహిళలను, యువతులను బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ అక్రమంగా తరలించడం)కు సంబంధం ఉన్నట్లు తేలిందని, దాని వల్ల మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడుతున్నాయని, చట్టరీత్యా ఇది నేరమని, సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని, డిజిటల్ అరెస్టు చేస్తారని భయపెట్టారు. కోర్టులో మీ తరఫున వాదించడానికి కొంత సొమ్ము డిపాజిట్ చేస్తే డిజిటల్ అరెస్టు ఆగుతుందంటూ మాయమాటలు చెప్పి రూ. 13.5 లక్షలను ఏపీలోని జగ్గంపేట అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. తర్వాత కాల్స్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన వైద్యురాలు పోలీసులను ఆశ్రయించారు. ఎస్‌ఐ రాజేష్, వెంకటరమణ, ఈశ్వరరావు, ధనలక్ష్మిల బృందం పదిరోజులు బయట రాష్ట్రాల్లోనే ఉంటూ దర్యాప్తు చేపట్టారు. వీరికి జిల్లా సైబర్ సెల్ పోలీసులు సహకారమందించారు. జగ్గంపేట అకౌంట్ ఫేక్‌దని గుర్తించారు.
పెట్రోల్ కొట్టడంతో దొరికిపోయి..
కేరళ రాష్ట్రంలోని మలబార్ తీరం వెంబడి ఉన్న కోజికోడ్ (కాలికాట్) నగరం ఓజీపాడుకు చెందిన నౌఫలా షెరీన్(24) తన బాయ్‌ఫ్రెండ్‌కు స్కూటీలో పెట్రోల్ కొట్టించడానికి బంక్ వద్దకు వెళ్లి తన ఖాతానుంచి రూ.120 డ్రా చేయడం..అక్కడి సీసీఫుటేజీ ఆధారంగా బండిని గుర్తించి చిరునామా తెలుసుకోవడంతో సూత్రధారులెవరన్నది తెలిసింది. దుబాయ్‌కు చెందిన సలీమ్ అనే వ్యక్తి ఖాతా నుంచి నౌఫలా షెరీన్‌కు రూ. 6 లక్షలు పడినట్లు తేలడంతో మొత్తం తీగ లాగారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన రూమన్ షరీఫ్, రెయాన్ అహ్మద్ ఖురేషిలు వాయినాడ్ కేంద్రంగాను, నౌఫలా షెరీన్, నిజాముద్దీన్ సీపీ (కేరళ), ఫహద్ అహ్మద్‌లు కేరళలోని కోజికోడ్ కేంద్రంగాను రెండు బ్యాచులుగా వీడి ఈ నేరాన్ని లింక్‌సిస్టమ్‌లా చేశారని పసిగట్టారు. వీరికి దుబాయ్‌లో ఉన్న సలీమ్ మంచి స్నేహితుడు కావడంతో అంతా పథకం ప్రకారం చేశారని, అయాన్ అనే వ్యక్తి కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారని, హర్యానాకు చెందిన మరికొందరు ఉండొచ్చని విచారణలో తెలుసుకున్నారు. పైన పేర్కొన్నవారంతా స్నేహితులు కావడం.. వారి సంపాదన విలాసాలకు చాలకపోవడంతో అక్రమ మార్గంలో డబ్బులు సాధించాలనే లక్ష్యంతోనే ఈ నేరం చేశారు. బాధితులు వేసే సొమ్ము వారి అకౌంట్లలో పడ్డాక క్షణాల్లో అమౌంట్‌ను డ్రా చేసి ఖాతాలను క్లోజ్ చేసి వారి వారి వివిధ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. ఈ విధంగానే సలీమ్ నౌఫలాకు రూ. 6 లక్షలు, రెయాన్ అహ్మద్ ఖురేషి రూమన్‌షరీఫ్‌కు రూ.5.80 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశారు.
రూ.13.5 లక్షలతో మహిళా వైద్యురాలిని బురిడీ కొట్టించిన వైనం
జిల్లాలో తొలిసారి డిజిటల్ అరెస్టు కేసు ఛేదించిన పోలీసులు
పట్టుబడ్డారిలా..
ఈ క్రమంలో ఈ నెల 13న కొందరి నుంచి బ్యాంకు అకౌంట్లు కొనే నిమిత్తం రూమన్‌షరీఫ్, నౌఫలా షెరీన్, నిజాముద్దీన్ సీపీ విశాఖపట్నం వస్తున్నట్లు ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడుకు సమాచారం వచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంటకు విశాఖ రైల్వే స్టేషన్లలోసిబ్బందితో మాటువేసి పట్టుకున్నారు. అనంతరం రూమన్ షరీఫ్ నుంచి రూ.లక్ష, నౌఫలా షెరీన్ నుంచి రూ. 2.5 లక్షలు, నిజాముద్దీన్ నుంచి రూ. 2.5 లక్షలు మొత్తంగా రూ. 6 లక్షల నగదు, మూడు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐ పైడపునాయుడు కేసును చాకచక్యంగా ఛేదించారని, మైసూర్, కోజికోడ్ ప్రాంతాలు తిరిగి కేసును ఛేదించిన ఎస్‌ఐ రాజేష్ బృందాన్ని, ఎస్‌ఐ హరికృష్ణలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


