రథచక్రాలు సిద్ధం
భువనేశ్వర్: పూరీ జగన్నాథ స్వామి యాత్రకు మూడు భారీ రథాల చక్రాల తయారీ పనులు పూర్తయ్యాయి. దీంతో శ్రీ మందిరం సింహద్వా రం అభిముఖంగా చేరేందుకు వీలుగా ఇరుసుకు అమరిన చక్రాల్ని సురక్షితంగా తరలించి క్రమ పద్ధతిలో నిలిపారు. రథాల తయారీ ప్రాంగణంలో నిత్యం రెట్టింపు ఉత్సాహంతో పనులు పుంజుకుంటున్నాయి. దశల వారీగా రథాల తయారీ పనులు నిరవధికంగా సాగుతున్నాయి. చక్రాల తయారీ తర్వాత ఇరుసుతో అనుసంధానం కీలకమైన దశ. తదనంతరం ఒక్కో ఇరుసుకు చక్రాల్ని అమర్చడం బృహత్ ప్రక్రియ. ఇదంతా ముగియడంతో తదుపరి పనులకు అనుకూలతకు అనుగుణంగా చక్రాల్ని క్రమ పద్ధతిలో సురక్షితంగా తరలించి సింహ ద్వారం ముంగిటకు చేర్చడం సవాలుతో కూడిన ప్రక్రియ.
భోయ్, మహరణ, వర్గం సేవకుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రక్రియని బుధవారం విజయవంతంగా ముగించారు. తొలుత బలభద్ర స్వామి తాళ ధ్వజం తరువాత జగన్నాథుని నందిఘోష రథం చివరగా దేవీ సుభద్ర దర్ప దళనం రథానికి వరుస క్రమంలో అన్ని చక్రాల్ని ఇరుసుకు జోడించారు. అనంతరం మూడు రథాల అధిపతి మహారణ, భోయ్ సర్దార్ రవి భోయ్ ఆధ్వర్యంలో మూడు రథాల చక్రాల తరలింపు దిశను నిర్ణయించారు. రథ యాత్ర ముందురోజున స్వామి ఆగమనం కోసం శ్రీ మందిరం సింహద్వారం ముంగిటకు ఎటువంటి అడ్డంకులు లేకుండా రథాల్ని తరలించేందుకు వీలుగా రథ తయారీ శాల ఆవరణ నుంచి తరలించారు. తదుపరి కార్యకలాపాలకు అంతరా యం తలెత్తకుండా చక్రాలు స్థిరంగా ఉండేందుకు వీలుగా పతి చక్రానికి ఇరు వైపులా మామిడి చెక్కల్ని అడ్డుగా ఏర్పాటు చేశారు.
రథచక్రాలు సిద్ధం
రథచక్రాలు సిద్ధం


