త్యాగం చేశాం.. న్యాయం చేయండి
● ఆప్‌షోర్ నిర్వాసితుల విన్నపం
మెళియాపుట్టి: రేగులపాడు ఆప్‌షోర్ కోసం సర్వం త్యాగం చేసిన తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు కోరారు. చీపురుపల్లిలో నిర్వాసితులు చేపడుతున్న దీక్ష శిబిరాన్ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తిలు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారికి నిర్వాసితులు వినతిపత్రాలు అందజేశారు. ప్రాజెక్టు కోసం సొంతూరు, స్థలాలు, పొలాలు, ఇళ్లు త్యాగం చేసిన తమ న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ప్రాజెక్టు ప్రారంభించి 16 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ నిర్వాసితులకు న్యాయం జరగలేదన్నారు. బడ్జెట్ ప్రతీ ఏడాది పెరుగుతున్నా.. నిర్వాసితుల సమస్యలు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం 460 జీవో ప్రకారం హిరమండలం నిర్వాసితులకు ఇచ్చిన ప్రాప్తికి ప్యాకేజీలు అందించాలని, ఇప్పటికీ కూడా 132 మందికి ప్యాకేజీలు పెండింగ్ ఉన్నాయన్నారు. సోషల్ ఎకనామిక్‌లో లేని 40 కుటుంబాలకు వెంటనే సర్వేచేసి పరిహారాలు అందజేయాలని వారి దృష్టికి తీసుకెళ్లారు. పునరావాస కాలనీల్లో ఇప్పటికీ రహదారులు, వీధిదీపాలు, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సర్పంచ్ యవ్వారి ఈశ్వరరావు, నిర్వాసితుల రాష్ట్ర కార్యదర్శి గంగారపు సింహాచలం, సీపీఐ కార్యదర్శి చాపర వెంకటరమణ, దొర విజయ్ కుమార్, కిరణ్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.


