దోపిడీ కేసులో ఇద్దరు అరెస్టు
జయపురం: యువకుడిపై మారణాయుధాలతో దాడి చేసి డబ్బు, ఇతర వస్తువులు దోచుకున్న కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని జయపురం సదర్ పోలీసులు ఆదివారం తెలిపారు. అరెస్టయిన వారిలో కొట్‌పాడ్ సమితి లఠిగుడ గ్రామానికి చెందిన దుబసేన్ మాలి, సనొపొరియ పంచాయతీ భుగుబందర్ గ్రామానికి చెందిన ధనపతి గోండ్ ఉన్నట్టు సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ వెల్లడించారు. అరెస్టయిన ఇద్దరిని కోర్టులో హాజరు పరచగా జడ్జి బెయిల్ నిరాకరించటంతో వారిని రిమాండ్‌కు తరలించామన్నారు. జయపురం సమితి సొలప గ్రామ వాసి ఉత్తమ టికాదార్ గత నెల ఏడో తేదీన ద్విచక్ర వాహనంపై జయపురం నుంచి తన గ్రామం సొలపకు వెళ్తుండగా మార్గంలో ధరణహండి అటవీ ప్రాంతంలో నలుగురు దుండగులు అడ్డగించి మారణాయుధాలతో చంపుతామని బెదిరించి అతడి వద్దగల రూ. 10 వేలుతోపాటు మొబైల్ ఫోను లాక్కున్నారు. అంతే కాకుండా అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న మరో 90 వేల రూపాయిలను బలవంతంగా పే ఫోన్ ద్వారా తీసుకొని పరారయ్యారు. దీంతో బాధితుడు ఉత్తమ్ గత నెల ఎనిమిదో తేదీన జయపురం సదర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లభించిన ఆధారాలతో ధనపతి, దుబసేన్‌లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ తెలిపారు. పట్టుబడిన వారినుంచి ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏఎస్సై ప్రమోద్ కుమార్ పాణి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దోపిడీ కేసులో ఇద్దరు అరెస్టు


