
బ్లడ్ బ్యాంకుల్లో.. నిల్వలు నిల్!
శ్రీకాకుళం కల్చరల్: జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వలు తగ్గిపోయాయి. దీంతో అత్యవసర వేళల్లో రక్తం అందక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాద బాధితులతో పాటు తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, క్యాన్సర్, డయాలసిస్ పేషెంట్లు తదితర బాధితులకు రక్తం అందించలేని పరిస్థితి ఏర్పడిండి. ఇండియన్ రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు ద్వారా తలసేమియా పిల్లలకు ఉచితంగా రక్తం ఎక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జిల్లాలో రక్తం నిల్వలు నిండుకున్న నేపథ్యంలో ఆయా చిన్నారులు అవస్థలు పడుతున్నారు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. కార్యాలయాలు, గ్రామాల్లో ఎప్పటికప్పుడు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ జిల్లా అవసరాలకు తగ్గట్లు నిల్వలు సరిపోవడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులో కొన్ని రకాల బ్లడ్ యూనిట్లు పూర్తిగా ఖాళీ అయ్యాయని, రక్తదాతలు స్పందించాలని కోరుతున్నారు.
దాతలు ముందుకు రావాలి
యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు, గ్రామైక్య సంఘాలు, మానవతా మూర్తులు స్పందించాలి. విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలి. శిబిరాలు నిర్వహించడానికి అవకాశం లేని వారు రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయవచ్చు. శిబిరం ఏర్పాటు చేయదలచుకుంటే 94404 90525 నంబరును సంప్రదించాలి.
– పి.జగన్మోహనరావు, రెడ్‌క్రాస్ చైర్మన్
అత్యవసర వేళల్లో రక్తం అందక అవస్థలు
రక్తదాతలు ముందుకు రావాలని నిర్వాహకుల పిలుపు

బ్లడ్ బ్యాంకుల్లో.. నిల్వలు నిల్!

బ్లడ్ బ్యాంకుల్లో.. నిల్వలు నిల్!