
ఆరోగ్య ప్రదం
ఔషధ గుణం..
ముంజులను విక్రయిస్తున్న రైతు
● తాటి ముంజులతో శరీరానికి పుష్కలంగా విటమిన్లు
● వేసవిలో డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం
● కామెర్లు, ఎసిడిటీ తీవ్రతను తగ్గించే గుణం
వజ్రపుకొత్తూరు:
వేసవి తాపాన్ని అధిగమించేందుకు, ఈ కాలంలో శరీరంలో సంభవించే అనేక రుగ్మతులను నివారించి ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రకృతి ప్రసాదించిన వరం తాటి ముంజలు. ఇవి ఐస్ యాపిల్‌గా విశేష ప్రాచుర్యం పొందాయి. తాటి ముంజుల సీజన్ ప్రారంభం కావడంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ తాటి ముంజులు శరీరంలోని చెక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేసే లక్షణం కలిగి ఉన్నందున వీటికి గిరాకీ పెరిగింది. ఇదివరకు గ్రామీణ ప్రాంతాల్లో తాటిచెట్లు అధికంగా ఉండేవి. అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కారణంగా మారుమూల గ్రామాల్లో సైతం తాటి చెట్లు నరికేస్తుండడంతో భవిష్యత్‌లో ఇవి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్న ఆందోళన ఉంది.
– ఆరోగ్య ప్రదాయిని
ప్రకృతిలో విరివిగా లభ్యమయ్యే తాటి ముంజులు కల్తీ లేనివి, స్వచ్ఛమైనవి కావడంతో ఆరోగ్య ప్రదాయినిగా భావిస్తుంటారు. ప్రస్తుతం జిల్లాలో తాటి ముంజులు సేకరించేవారు కరువయ్యారు. దీంతో మైదాన ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైతు కూలీలు తాటి ముంజులను పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. జిల్లాల్లోని శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, కోటబొమ్మాళి, పలాస, హరిపురం, ఇచ్ఛాపురం పట్టణాల్లో ఎక్కువగా విక్రయాలు చేపడుతున్నారు. తాటి ముంజుల పరిమాణాన్ని బట్టి డజను రూ.80ల నుంచి రూ.120ల వరకు విక్రయిస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నా తాటి ముంజుల ప్రియులు విశేషంగా కొనుగోలు చేస్తున్నారు.
ప్రయోజనాలు
● తాటి ముంజుల్లో విటమిన్లు, పాస్పరస్, థయామిన్, బీ–కాంప్లెక్స్, కాల్షియం, పొటాషియంతో పాటు సోలేబుల్ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
● వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల డీహైడ్రేషన్‌ల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేసవి తాపం, వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది. వికారం, వాంతులను నివారిస్తుంది.
● తాటి ముంజులు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన హానికర వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంతో పాటు రక్తపోటు(బీపీ)ను అదుపులో ఉంచుతుంది.
● వేసవిలో ఏటా సీజన్లో క్రమం తప్పకుండా తాటి ముంజలను తినడం వల్ల చెడు కొలెస్త్రాల్ తగ్గించుకుని మంచి కలెస్ట్రాల్‌ను వృద్ది చేసుకోవచ్చు.
● వీటిలో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉండడం వలన అలసట, నిర్జలీకరణం నుంచి ఉపశమనం కల్పించి శరీరం బరువు పెరగకుండా చేస్తుంది.
● వీటిలో ఉండే పోషకాలు జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గించి, జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
● ఆహారంలో సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటీ, ఉదర సంబంధ సమస్యల నివారణకు దోహదపడుతుంది.
● మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ ఫాక్స్ నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
● తాటి ముంజులను గుజ్జుగా చేసి ముఖానికి పూతలా వేస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. చర్మానికి కావాల్సినంత తేమను అందించి చెమట కాయలను నివారిస్తుంది. ఎండ వేడిమికి ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది. పోషకాలు అధికంగా ఉండడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెంచి ఎసిడిటీ, కామెర్ల తీవ్రతను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
ఏడాదికి ఒక్కసారైనా తినాలి
తాటి ముంజ కల్తీలేని స్వచ్ఛమైన పోషకాహారం. వేసవి నుంచి వర్షాకాలం ప్రారంభం వరకు తాటి ముంజులు లభ్యమవుతాయి. ఇవి తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందనడంలో సందేహం లేదు. మా ప్రాంతంలో కోసేవారు లేకపోవడంతో ఇచ్ఛాపురం, హరిపురం పలాస, టెక్కలి, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి తెప్పించుకుని తింటాం. కొన్నిసార్లు పలాస– విశాఖ పాసింజర్ ట్రైన్లలో సైతం విక్రయాలు చేస్తుంటారు. అలాంటి సమయాల్లో ఎక్కువ తీసుకుంటాం. ఐస్ యాపిల్‌గా పిలిచే తాటి ముంజలను ఏడాదికి ఒకసారైనా తిలనాలని కోరిక ఉంటుంది.
– ఎం.కృష్ణారావు, బ్రాహ్మణతర్ల, పలాస
మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
తాటి ముంజలు మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. లేతవి, జెల్లీలా ఉన్నవి తింటే రుచిగా ఉంటాయి. మా ఊరులో ఉన్న చెట్లు నుంచి గెలలను తీసి కోసుకుని తింటాం. పైగా వేసవిలో చల్లదనం ఇచ్చి దాహార్తిని తీరుస్తుంది. సరదాగా గడుపుతూ తోటల్లోకి చేరి, కొండ పక్కన ఉన్న తోటల్లో తాటిచెట్లు నుంచి కాయలను తీసి కుర్రాళ్లమంతా పంచుకుని తింటాం. అదో తియ్యని జ్ఞాపకం.
– డి.ఢిల్లీరావు , అమలపాడు, వజ్రపుకొత్తూరు

ఆరోగ్య ప్రదం

ఆరోగ్య ప్రదం

ఆరోగ్య ప్రదం

ఆరోగ్య ప్రదం