
రఘునాథ్ పట్నాయక్ సేవలు చిరస్మరణీయం
జయపురం: మాజీ మంత్రి దివంగత రఘునాథ్ పట్నాయక్ రాష్ట్రానికి అందించిన సేవలు మరువలేనివని వక్తలు పేర్కొన్నారు. ఆయన వర్ధంతి పురస్కరించుకొని జయపురం – మల్కన్‌గిరి మార్గంలోని పవర్ హౌస్ కూడలిలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జయపురం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపొంది, కేబినేట్‌లో మంత్రిగా పదవులు చేపట్టారన్నారు. అలాగే లా రివిజన్ కమిషన్ చైర్మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే నల్కో, హాల్ ప్రాజెక్టులతో పాటు, జయపురం లా కళాశాల, మహిళా కళాశాలలు నెలకొల్పడడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కాంగ్రెస్ నేత బినోద్ మహాపాత్రో, న్యాయవాది, కాంగ్రెస్ నేత మదన మోహన్ నాయిక్, జయపురం సాహిత్య పరిషత్ అధ్యక్షుడు హరిహర కరసుధా పట్నాయిక్, దుర్గా శతపతి, బీజేడీ కౌన్సిలర్ బి.విష్ణువర్ధణ రెడ్డి, రఘునాథ్ పట్నాయిక్ కుమారులు ధిరెన్ మోహన్ పట్నాయక్, ప్రతీష్ పట్నాయక్, ప్రియూష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.