
దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు వితరణ
కొరాపుట్: దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాల వితరణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోనిలో మండయ్ మైదానం పక్కనే ఉన్న డాల్ఫిన్ రిసార్టులో నబరంగ్‌పూర్ ఎంఎల్‌ఏ గౌరీ శంకర్ మజ్జి రిబ్బన్ కత్తిరించి శిబిరాన్ని ప్రారంభించారు. ప్రమాదాలలో కాలు, చేతులు కోల్పోయిన వారికి వీటిని అమరుస్తున్నారు. రాజస్ధాన్ నుంచి వచ్చిన వైద్య నిపుణులు దివ్యాంగులు కోల్పోయిన అవయవాల నమూనా ప్రకారం వాటిని అమరుస్తున్నారు. ఈ అవయవాల ఖర్చు ప్రభుత్వం భరిస్తుండగా, కార్యక్రమ నిర్వహణ, దివ్యాంగుల రవాణా, భోజనాలు, వసతిని మార్వాడి యువ మంచ్ ఉచితంగా ఏర్పాటు చేసింది. మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో తొలి రోజు 83 మందికి అవయవాలు అమర్చారు. ముందస్తు సమాచారం లేకుండా ఎవరైనా ఈ మూడు రోజులలో శిబిరం వద్దకు వస్తే వారికి కూడా అవయవాలు అందిస్తామని నిర్వాహకులు ప్రకటించారు.