
జిల్లా లేబర్ కార్యాలయం ఘెరావ్
జమపురం: ఆల్‌ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ)నేతత్వంలో సోమవారం వందలాది మంది శ్రామికులు జయపురం లేబర్ కార్యాలయాన్ని ముట్టడించారు. స్వాతంత్య్ర యోధురాలు లక్ష్మీపండ స్మృతి కూడలి నుంచి జిల్లా లేబర్ కార్యాలయానికి వచ్చి కార్యాలయాన్ని ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నేతలు ప్రమోద్ కుమార్ మహంతి, జుధిష్టర్ రౌళో లేబర్ అధికారికి మెమొరాండం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉద్దేశించిన మెమొరాండంలో వివిధ పథకాల్లో పని చేస్తున్న మహిళలకు, పురుషులకు కనీస నెల వేతనం రూ.26,000 ఉండాలని, సామాజిక సురక్ష కల్పించాలని, ఈపీఎఫ్ పెన్షన్ అమలు చేయాలని, ధరలు నియంత్రించాలని, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు పూర్తి చేయాలని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ, ఆశ సిబ్బందిని రెగ్యులర్ చేసి కనీస వేతనం అమలు చేయాలని కోరారు. సేవా పేపరుమిల్లు ఉద్యోగుల 8 నెలల బకాయి వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి మాట్లాడుతూ కార్మికుల హక్కులు, రక్షణ కోసం ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ నెల 20 వ తేదీన అఖిల భారత స్థాయిలో ఆందోళన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆందోళనలో వంట సహాయకుల సంఘం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు ఉత్తమ మల్లిక్, కార్మిక నేత జుధిష్టర్ రౌళో, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రామకృష్ణ దాస్, యువనేత సత్యబ్రత నందో, నిర్మాణ కార్మిక సంఘ నేత సుఖు ఖిన్‌భుడి, పేపరు మిల్లు కార్మిక సంఘ కార్యదర్శి కె.సత్యనారాయణ, బసంత బెహర, త్రిపతి మఝి, అజిత్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా లేబర్ కార్యాలయం ఘెరావ్

జిల్లా లేబర్ కార్యాలయం ఘెరావ్