
ఎంపీ పర్యటనపై ఉద్రిక్తత
జయపురం, కొరాపుట్: కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క జయపూర్ పర్యటనపై ఉద్రిక్తత నెలకొంది. ఒక్క సారిగా శాంతి భద్రతల సమస్య రేగింది. ఇటీవల పార్లమెంట్‌లో జరిగిన వక్ఫ్ బోర్డు వ్యతిరేక బిల్లు పై జరిగిన ఓటింగ్ లో పార్టీ ఆదేశానుసారం వ్యతిరేకంగా ఉల్క ఓటు వేశారు. దాన్ని నిరసిస్తూ జయపూర్‌లో హిందూ పరివార్ వర్గాలు ఆయన జయపూర్ పర్యటన అడ్డుకుంటామని హెచ్చరించాయి. ముందస్తుగా గమనించిన ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులను హెచ్చరించారు. వెంటనే జయపూర్ పట్టణ పోలీసులు వారిని అదుపు లోనికి తీసుకున్నారు.
ఒక్కటైన ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు
ఇంత వరకు ఎంపీ ఉల్కకి స్థానిక ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి వర్గాలకు సరిపడేది కాదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే వర్గం ఎంపీకి అండగా నిలిచింది. ఎమ్మెల్యే అనుచరులు బైక్ ర్యాలీ ద్వారా ఎంపీ ఉల్కకి స్వాగతం పలికారు. జయపూర్ మెయిన్ రోడ్డులో గల కాంగ్రెస్ కార్యాలయంలో భారీ ఎత్తున కార్యకర్తలు సమావేశం నిర్వహించారు.
పార్టీ నిర్ణయం శిరోధార్యం
పార్టీ నిర్ణయం ప్రకారం వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేశానని, రాజ్యంగ స్ఫూర్తి ప్రకారం నడుచుకున్నానని ఉల్క తెలిపారు. పెహల్గాంలో టెర్రరిస్టులు జరిపిన హత్యాకాండ అమానుషమని అన్నారు. ఇలాంటి హింసని ఏమాత్రం అంగీకరించకూడదన్నారు.
మీరేనా హిందువులు...నేను కాదా
ఎంపీని అడ్డుకొంటామని హెచ్చరించిన వారే హిందువులా.. మరి నేను కాదా అంటూ ఎమ్మెల్యే అన్నారు. అవసరమైతే పోరాటానికి వెనుకాడబోమన్నారు.

ఎంపీ పర్యటనపై ఉద్రిక్తత

ఎంపీ పర్యటనపై ఉద్రిక్తత