● పునర్నిర్మాణ దశలో దుండగుల దుశ్చర్య ● బోడసింగిపేటలో ఘటన ● దుర్గాదేవి, గరుత్మంతుడు విగ్రహాల ధ్వంసం
బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామంలో జాతీయ రహదారి 26కు ఆనుకోని పునర్నిర్మాణంలో ఉన్న సీతారామ ఆలయంలో దేవుడి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామంలో గతంలో ఉన్న ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని పునర్నిర్మించేందుకు గ్రామస్తులంతా ఐక్యంగా శ్రీకారం చుట్టారు. పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. పెద్దాపురానికి చెందిన శిల్ప కళాకారులు ఆలయ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇంతలోనే ఆలయం వెలుపల గోడకు ఆనుకోని నిర్మాణ తుది దశలో ఉన్న దుర్గాదేవి విగ్రహంతో పాటు గరుత్మంతుడు విగ్రహాల చేతులు, కాళ్లను దుండగలు ధ్వంసం చేశారు. రోజూలాగే ఆదివారం ఉదయం పనులకు వచ్చిన శిల్ప కళాకారులు విగ్రహాలు ధ్వంసం కావడం చూసి గ్రామ పెద్దలకు విష యం తెలిపారు. సర్పంచ్ కోరాడ జానకీరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ యు.మహేష్ ఆలయం వద్దకు చేరుకొని ధ్వంసమైన విగ్రహాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా గ్రామానికి ఆనుకొని రెండు మద్యం దుకాణాలు ఉండడంతో మందుబాబులే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా విగ్రహాల ధ్వంసం విషయం తెలుసుకున్న రాష్ట్ర చిన్న, మధ్య తరహ, ఎన్‌ఆర్‌ఐ వ్యవహరాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆలయానికి వచ్చి పరిశీలించారు.
ఆలయంలో దేవుడి విగ్రహాల ధ్వంసం