సాక్షి ప్రతినిధి, విజయనగరం/గుర్ల: డయేరియా ప్రబలి గత ఏడాది అక్టోబరులో 13 మంది ప్రాణాలు కోల్పోతే వారిలో పది మంది తాలూకు కుటుంబసభ్యులకు మాత్రమే జనసేన పార్టీ ఆర్థిక సాయం అందింది. ఐదు నెలల కిందట గుర్లలో పర్యటన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్ల డయేరియా మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గుర్లలో శనివారం నెల్లిమర్ల ఎమ్మెల్యే (జనసేన) లోకం నాగమాధవి, ఆమె భర్త లోకం ప్రసాద్ ఆధ్వర్యంలో చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, ఎంఎస్‌ఎంఈ చైర్మన్ టి.శివశంకర్ పాల్గొన్నారు.
గుర్ల అంటే గుర్లలో వారికి మాత్రమే...
గత ఏడాది అక్టోబరులో గుర్ల మండల కేంద్రంతో పాటు సమీపంలోని కోటగండ్రేడు, నాగళ్లవలస గ్రామాల్లోనూ డయేరియా విజృంభించింది. దీంతో గుర్లలో పది మంది, కోటగండ్రేడులో ఒకరు, నాగళ్లవలసలో ఇద్దరు చనిపోయారు. కానీ కూటమి ప్రభుత్వం కోటగండ్రేడుకు చెందిన మరడాన అప్పలనర్సమ్మ ఒక్కరే డయేరియా కారణంగా చనిపోయారని ప్రకటించి చేతులు దులుపుకుంది. వైఎస్సార్‌సీపీ తరఫున రూ.2 లక్షల చొప్పున 13 మంది కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం చేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది నవంబరు 26న శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడైన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చెక్కులు అందజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జనసేన తరఫున కేవలం పది మంది కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సాయం అందించారు. కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన డయేరియా మృతురాలు అప్పలనర్సమ్మ కుటుంబాన్ని జనసేన విస్మరించడం గమనార్హం. పవన్ కళ్యాణ్ గుర్ల అన్నారని, ఆ గ్రామంలోని పది మంది కుటుంబాలకు మాత్రమే చెక్కులిచ్చి సరిపెట్టడం చర్చనీయాంశమైంది.
పది మంది మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందజేత