జయపురం: భూమి విలువలు (రిజిస్ట్రేషన్ చార్జీలు) పెంచటం వలన క్రయ, విక్రయాల సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయని జయపురం రియల్ ఎస్టేట్ డవలప్‌మెంట్ అసోసియేషన్ సభ్యులు బుధవారం భువనేశ్వర్‌లో రెవెన్యూ మంత్రి సురేష్ పూజారిని కలిసి విన్నవించారు. భూములు కొనటం, ప్లాటులు వేయటం నిలిచిపోయాయని మంత్రికి వివరించారు. టౌన్ ప్లానింగ్, మున్సిపాలిటీ అనుమతులు ఉన్నప్పటికీ వాటికి పట్టాలు లభించకపోవటం వలన అమ్మేందుకు తహసీల్దార్ అనుమతి లభించటం లేదన్నారు. బహుళ ఆదివాసీ వెనుక బడిన కొరాపుట్ జిల్లాలో కటక్, భువనేశ్వర్‌తో సమానంగా భూమి రేట్లు పెరిగాయన్నారు. భూముల క్రయవిక్రయాలు నిలిచిపోతున్నందున పిల్లల చదువులు, వివాహాలు చేసేందుకు ఆదివాసీ, నిరుపేద సంప్రదాయ ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. గతంలో భూ క్రయవిక్రయాలు జరిగి వాటికి పట్టాలు లభించకపోవటంతో కొనుక్కొనేవారు ఇళ్లు నిర్మాణానికి బ్యాంక్ రుణాలు లభించక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. జయపురం తాలూకాలో కుంతర్ కల్ మౌజలో పంట భూమిని బెంజ్ మార్క్ విలువ కన్నా అధికంగా పెంచారని, దీనిపై మరోసారి ఆలోచించాలని మంత్రిని కోరారు. ఈ సమస్యలపై ఏప్రిల్ నాటికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో కొరాపుట్ జిల్లా రియల్ ఎస్టేట్ డవలప్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు హిమాంశు మహాపాత్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ పాణిగ్రహి, విక్రమ సాహు, అరుణ వర్మ, పాల్గొన్నారు.