భువనేశ్వర్: రాష్ట్రంలో బంగారం నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర వాణిజ్య, రవాణా, ఉక్కు, గనుల శాఖ మంత్రి బిభూతి జెనా సభలో లిఖితపూర్వకంగా ప్రకటించారు. సుందర్‌గడ్, నవరంగ్ పూర్, అంగుల్, కొరాపుట్ ప్రాంతాలలో బంగారు గనులు ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. మల్కన్‌గిరి, సంబల్‌పూర్, బౌద్ జిల్లాల్లో కూడా బంగారు గనులు ఉన్నాయన్నారు. రాష్ట్రం ఖనిజ నిక్షేపాలతో తులతూగుతుంది. చైనాకు రాష్ట్రం ఇనుప ఖనిజం ఎగుమతి చేస్తుందని మంత్రి తెలిపారు. 2024 – 25 ఆర్థిక సంవత్సరం మార్చి నెల 10 నాటికి రూ. 1019 కోట్ల 80 లక్షల ఆదాయం సమకూరిందని మంత్రి విశ్లేషించారు.
మద్యం ప్రభావంతో రోడ్డు ప్రమాదాలు
రాష్ట్రంలో మద్యపానం ప్రభావంతో సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్రంగా 56 వేల 831 రోడ్డు ప్రమాదాలు సంభవించినట్లు రాష్ట్ర రవాణా విభాగం మంత్రి బిభూతి జెనా తెలిపారు. ఈ ప్రమాదాల్లో 27,167 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50,041 మంది గాయపడ్డారని మంత్రి సభలో లిఖితపూర్వక సమాధానం ప్రవేశ పెట్టారు. రాష్ట్రంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య పెరుగుతోంది. ’మద్యపానం చేసి వాహనాలు నడపడం వల్ల గత 3 ఏళ్లలో 2,127 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. 22,672 మంది మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. వాహన చట్టం నిబంధనల ఉల్లంఘనల కింద 11,377 మంది డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసినట్లు మంత్రి ప్రకటించారు.