
నామినేషన్ దాఖలు చేస్తున్న ప్రమీలా మల్లిక్
భువనేశ్వర్: రాష్ట్ర శాసనసభ స్పీకర్ పదవికి బిజూ జనతాదళ్ (బీజేడీ) అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ఒకరోజు తర్వాత, ప్రమీలా మల్లిక్ గురువారం రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. పలువురు మంత్రులు మరియు బీజేడీ ఎమ్మెల్యేలతో కలిసి తన నామినేషన్ దస్తావేజులను అసెంబ్లీ కార్యదర్శికి దాఖలు చేశారు. ఈ ఎన్నిక ఈనెల 22న శుక్రవారం ఉదయం 9.30 గంటలకు జరుగుతుంది. వెంబడి శాసన సభలో వర్షాకాలం సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో ఎన్నికై న కొన్ని క్షణాల్లో ప్రమీలా మల్లిక్ రాజ్యాంగబద్ధమైన ప్రతిష్టాత్మక స్పీకరు సింహాసనం అధిష్టిస్తారు. అధ్యక్షా సంబోధనతో గౌరవప్రదమైన సహా మర్యాదలను పొందుతారు. ఈ అరుదైన అవకాశం తొలి మహిళగా ప్రమీలా మల్లిక్‌కు వరించడం విశేషం.
ఎన్నిక ఏకగ్రీవం
ప్రమీలా మల్లిక్ ఏకగ్రీవంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఎన్నిక అవుతారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థిని బరిలోకి దింపేది లేదని ప్రకటించింది. సభలో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రమీలా మల్లిక్ ఎన్నికకు తిరుగు లేదనేది సుస్పష్టం. 147 మంది ఎమ్మెల్యేలు ఉన్న సభలో బీజేడీకి 113 మంది సభ్యులు ఉండగా, బీజేపీ బలం 22, కాంగ్రెస్‌కు నామమాత్రంగా 9 మంది సభ్యుల బలంతో ఊగిసలాడుతుంది. ఈ ఏడాది మే 12న నవీన్ పట్నాయక్ కొలువు పునర్వ్యవస్థీకరణ పురస్కరించుకుని విక్రమ్ కేశరి అరూఖ్ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయనకు ఆర్థిక శాఖ మంత్రిగా నియమించడంతో శాసన సభలో స్పీకర్ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానం భర్తీ చేసేందుకు మధ్యంతర ఎన్నిక నిర్వహణ అనివార్యమైంది. అధికార పక్షం ప్రమీలా మల్లిక్‌కు స్పీకర్‌గా పోటీ చేసేందుకు బరిలోకి దింపింది. ఆమె జాజ్‌పూర్ జిల్లా భింజర్‌పూర్ నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై శాసన సభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1990లో భింజార్‌పూర్ నుంచి జనతా దళ్ (జేడీ) అభ్యర్థిగా పోటీచేసి విజేతగా నిలిచి ఎమ్మెల్యేగా తొలిసారి శాసనసభలో అడుగు పెట్టారు. ఆమె 2000 నుంచి ఈ నియోజక వర్గం నుంచి గెలుపొందుతున్నారు. 2004 నుంచి 2011 వరకు మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా 3 సంవత్సరాల పాటు కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. 2019 సంవత్సరం మే 30 నుంచి 2022 సంవత్సరం జూన్ 6 వరకు చీఫ్ విప్‌గా కొనసాగారు.
తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికవ్వనున్న ప్రమీలా