
గృహనిర్మాణాలపై సమీక్ష నిర్వహిస్తున్న పీడీ శ్రీనివాస్
● గృహనిర్మాణశాఖ పీడీ డి.శ్రీనివాసరావు ● మెరకముడిదాంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష
మెరకముడిదాం: ఇళ్ల నిర్మాణంతో పాటు మరుగుదొడ్లను కూడా కచ్చితంగా నిర్మించాలని గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన గృహనిర్మాణాలపై మెరకముడిదాం మండల ఏఈ, సిబ్బందితో పాటు సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా మండలంలో ఇంతవరకూ మంజూరైన ఇళ్లు ఎన్ని? నిర్మాణాలు పూర్తయినవి ఎన్ని? పూర్తి కావాల్సినవి ఎన్ని? అని ప్రశ్నించారు. దీనికి ఏఈ సమాధానమిస్తూ మండలానికి సంబంధించి 1972 ఇళ్లు మంజూరు కాగా అందులో 1462 నిర్మాణం పూర్తయిందని, ఇంకా 171 ఇళ్ల నిర్మాణం పునాదుల లెవెల్‌వరకూ జరిగిందని, శ్లాబ్ లెవెల్ వరకూ 119 కాగా శ్లాబ్ పూర్తయినవి 87 ఉన్నాయని, నిర్మాణం ప్రారంభం ఇళ్లు 133 ఉన్నాయని తెలిపారు. అలాగే 23 జగనన్న లేఅవుట్లలో 669 ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మిస్తున్నారా? అని ఏఈని పీడీ ప్రశ్నించగా లబ్ధిదారులు మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో గృహనిర్మాణాశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి.శ్రీనివాసన్, డిప్యూటీ ఇంజినీర్ జి.మురళీమోహన్, ఎంపీడీఓ ఎం.రత్నం, ఉపాధి ఏపీఓ ఎస్.పెదప్పలనాయుడు, మండలానికి చెందిన ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.