ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు సోమవారం రావణ వాహన సేవ జరిగింది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో రెండో రోజైన సోమవారం ఉదయం మూలమంత్ర హవనం, సాయంత్రం ఔపాసన, బలిహరణ, హారతి, మంత్రహవనం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రాంగణంలోని మహా మండపం నుంచి నగరోత్సవ సేవ ప్రారంభమైంది. రావణ వాహనంపై కొలువై ఉన్న శ్రీగంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు విశేషంగా అలంకరించి పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ ఊరేగింపును ప్రారంభించారు. మహామండపం నుంచి ప్రారంభమైన రావణ వాహన సేవ రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామారంగం చౌక్, మెయిన్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆది దంపతులకు భక్తులు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఆదిదంపతులకు పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించి పూజలు జరిపించుకున్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ, చిన్నారుల కోలాట విన్యాసాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య నగరోత్సవం కనులపండువగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు ఆది దంపతుల కల్యాణోత్సవం
చైత్రమాస బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఆది దంపతుల కల్యాణం కనులపండువగా నిర్వహించనున్నారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని రాయబార మండపంలో మంగళవారం రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం, రాత్రి 10:30 గంటలకు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దివ్య కల్యాణోత్సవం జరుగుతుంది.


