లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో ప్రజల నుంచి 75 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వృద్ధులు, నడవలేని వికలాంగుల వద్దకు స్వయంగా వెళ్లి ఆమె ఫిర్యాదులు తీసుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్య అడిగి తెలుసుకుని, దానిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత ఎస్‌హెచ్‌ఓలకు ఫోన్‌లో ఆదేశాలు ఇచ్చారు. ఫిర్యాదుల్లో అత్యధికంగా భూ, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 29 ఫిర్యాదులు అందాయి. ఇతర ఫిర్యాదుల్లో కుటుంబ తగాదాలపై 7, వివిధ మోసాలపై 5, మహిళా సంబంధిత నేరాలపై 6, దొంగతనాలపై 3, కొట్లాటలపై 3, ఇతర వివిధ సమస్యలపై 22 ఫిర్యాదులు అందాయి.


