ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కారు డ్రైవర్ నిర్లక్ష్యం దుర్గగుడి అర్చకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరానికి చెందిన పాణిగ్రాహి జగన్మోహన శర్మ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గత గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన జగన్మోహనశర్మను తాడేపల్లి పీహెచ్‌సీ సెంటర్‌కు వచ్చే సరికి కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో జగన్మోహనశర్మ రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. ప్రమాదస్థలం నుంచి హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. మరి కొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన జగన్మోహన శర్మ మరణం కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ప్రమాదంపై జగన్మోహన శర్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ప్రమాదానికి కారణమైన కారు యజమానిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన శర్మ భౌతికకాయాన్ని దుర్గగుడి దేవస్థానానికి చెందిన పలువురు అధికారులు, అర్చకులు, సిబ్బంది సందర్శంచి నివాళులర్పించారు.


