లబ్బీపేట(విజయవాడతూర్పు): నందిగామ మండలం చందాపురంలో కలుషిత ఆహారం తిని పలువురు అతిసార బారిన పడటంతో తాజా పరిస్థితిని సమీక్షించేందుకు సోమవారం వైద్యశాఖ ఉన్నతాధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు. వైద్య శాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మల్లేశ్వరి, రాష్ట్ర ఆరోగ్య అధికారి డాక్టర్ పద్మజ, రాష్ట్ర ఐడీఎస్పీ సెక్షన్ ఇన్‌చార్జి శ్రీహరి వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని గ్రామాన్ని సందర్శించారు. వారితోపాటు సిద్ధార్థ వైద్య కళాశాలకు చెందిన మైక్రో బయాలజిస్ట్ డాక్టర్ వై.సరిత, కమ్యూనిటీ మెడిసిన్ వైద్యులు ఇ.భానుకిరణ్, జనరల్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ వి.జ్యోతి ఇంటింటినీ సందర్శించి అతిసారకు గల కారణాలను, తీవ్రత ను అంచనా వేశారు. ప్రస్తుతం 13 మంది సోమ వారం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, ఇంకా వేర్వేరు ఆస్పత్రిల్లో 15 మంది చికిత్స పొందుతున్నట్లు డీఎంహెచ్‌ఓ మాచర్ల సుహాసిని తెలిపారు.
బాధిత బాలికకు ఐద్వా నేతల పరామర్శ
ఎ.కొండూరు: రామచంద్రాపురం గ్రామంలో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనలో బాధిత బాలికను, కుటుంబ సభ్యులను ఐద్వా మహిళా సంఘం నాయకులు సోమవారం పరామర్శించారు. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని, పోలీస్ అఽధికారులను డిమాండ్ చేశారు.


