కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన శాశ్వత భూ హక్కు కమిటీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు శాశ్వత భూహక్కులు కల్పించాలని తూర్పు నియోజకవర్గ పేదల శాశ్వత భూ హక్కు కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పేదల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం కలెక్టరేట్‌లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు తూర్పు నియోజకవర్గ పేదల శాశ్వత భూహక్కు కమిటీ వినతిపత్రం అందజేసింది. అనంతరం కమిటీ సభ్యులు సెద్దెల అవినాష్, జై ఆంధ్ర జేఏసీ చైర్మన్ జై బాబు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో క్రీస్తురాజపురం, గుణదల, మాచవరం, మొగల్రాజపురం, ఆర్టీసీ బస్టాండ్ మొదలు రామలింగేశ్వర నగర్ కట్ట వరకు, కొండ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాస భూములపై హక్కులు లేకుండా జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వ భూముల్లో నివసించే ఎస్సీ, ఎస్టీ, బీసీలు భూ హక్కుకు దూరంగా ఉంటున్నారన్నారు. వీరికి ఎటువంటి న్యాయపరమైన రక్షణ లేకుండా పోతుందన్నారు. పేదల భూములు కబ్జాకు గురవుతున్నాయని, వాటిని అరికట్టాలన్నారు. 22ఏ భూములపై సర్వే నిర్వహించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదు సెంట్లు భూమి, గృహ నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో బీజేపీ నాయకులు కిషోర్, బీఎస్పీ నాయకులు కనపర్తి మురళి, బోరుగడ్డ వర ప్రసాద్ తదితరులు ఉన్నారు.


