పూల పరిమళం.. భక్తి పరవశం | - | Sakshi
Sakshi News home page

పూల పరిమళం.. భక్తి పరవశం

Mar 27 2026 9:51 AM | Updated on Mar 27 2026 9:51 AM

పూల పరిమళం.. భక్తి పరవశం గ్రేడ్‌–2 మునిసిపాలిటీగా తిరువూరు పోలీసుల అదుపులో ఇద్దరు గంజాయి విక్రేతలు

దుర్గమ్మకు సంపంగి, చామంతి, మల్లెలతో అర్చన

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు గురువారం అమ్మవారికి సంపంగి, చామంతి, మల్లెలతో విశేషంగా అర్చన జరిగింది. తొలుత ఆలయ ప్రాంగణంలోని కళావేదిక నుంచి ఈవో శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ, ఆలయ అర్చకులు, సిబ్బంది అమ్మవారి అర్చన నిమిత్తం సేకరించిన పుష్పాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్‌కు పుష్పాలను సమర్పించారు. అనంతరం అర్చకులు పుష్పాలతో అర్చన నిర్వహించారు. పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. ఆ పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు.

ఆంజనేయ స్వామికి విశేష పూజలు..

చైత్రమాస అష్టమి, శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి క్షేత్రపాలకుడైన వీరాంజనేయ స్వామి వారికి గురువారం విశేష అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద ఆంజనేయ స్వామి వారికి, ఘాట్‌రోడ్డులోని స్వామి వారి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరువూరు: ఇప్పటివరకు నగర పంచాయతీగా ఉన్న తిరువూరును గ్రేడ్‌–2 మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత కౌన్సిల్‌ సమావేశంలో తిరువూరును మునిసిపాలిటీగా వర్గోన్నతి చేయాలని తీర్మానించి ప్రభుత్వానికి పంపగా, గ్రేడ్‌–2 మునిసిపాలిటీ హోదా కల్పిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సురేష్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు. గత రెండు సంవత్సరాల్లో నగర పంచాయతీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పెనమలూరు: కానూరులో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. కానూరు సెక్టార్‌ ఎస్‌ఐ జి.రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు కల్పనానగర్‌లో కొందరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు గురువారం అక్కడకు వెళ్లారు. ఆసమయంలో నలుగురు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు. పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. మరో ఇద్దరు పట్టుబడ్డారు. వారి వద్ద రెండు బ్యాగుల్లో ఆకుపచ్చని ఎండిన ఆకులు, కాండం, పువ్వులు, విత్తనాలు కనపడ్డాయి. పట్టుబడిన వారిలో కానూరుకు చెందిన సయన అనంత్‌కుమార్‌(32), తాడిగడప గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ మహేష్‌(26) వద్ద పోలీసులు వివరాలు సేకరించారు. పోలీసులకు చిక్కకుండా పారిపోయిన షేక్‌ జాన్‌బాషా(జాన్‌బెర్రీ), రామవరప్పాడు చెందిన అక్బర్‌తో కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నామని వారు తెలిపారు. విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయి తీసుకు వస్తున్నామన్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ మాదకద్రవ్యం కూడా తీసుకువచ్చామని తెలిపారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నామన్నారు. నిందితుల వద్ద 5 కిలోల గంజాయి, ఒక గ్రాము ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement