యనమలకుదురులో కొనసాగుతున్న విచారణ | - | Sakshi
Sakshi News home page

యనమలకుదురులో కొనసాగుతున్న విచారణ

Mar 27 2026 9:51 AM | Updated on Mar 27 2026 9:51 AM

యనమలకుదురులో కొనసాగుతున్న విచారణ మల్లేశ్వరాలయంలో ఇద్దరు అర్చకులు సస్పెండ్‌ హోటళ్లపై పౌర సరఫరాల శాఖ దాడులు

పెనమలూరు: యనమలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీపార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానంలో స్వామివారి సొమ్ము స్వాహా ఘటనపై విచారణ కమిటీ విచారణ గురువారం కొనసాగింది. ఆలయంలో హుండీలో సొమ్ము నకిళీ తాళంతో స్వాహా చేశారని ఆలయ ఈవో భవాని, పూజారులు సాగర్‌, పూర్ణ, ఉద్యోగి రోశయ్యలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేయాలని ఎండోమెంట్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆలయ రికార్డులను విచారణ కమిటీ తనిఖీ చేస్తున్నారు. మరో రెండు వారాల పాటు విచారణ కొనసాగనుందని తెలుస్తోంది.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు అర్చకులపై దుర్గగుడి ఈవో శీనానాయక్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో 3వ షిఫ్టులో ఉప ప్రధాన అర్చకుడు పి. శ్రీనివాసశర్మ, పరిచారకుడు కె. నాగరాజు విధులు నిర్వర్తించాల్సి ఉంది. బుధవారం రాత్రి ఈవో శీనానాయక్‌, ఇతర అధికారులు మల్లేశ్వరాలయానికి వెళ్లగా అక్కడ ఇద్దరు అర్చకులు విధులకు హాజరు కాలేదు. సదరు విషయాన్ని ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇద్దరు అర్చకులను సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొంటూ.. ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు ఎవరైనా సరే వారికి కేటాయించిన విధుల్లో ఉండాలని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

8 డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లను వినియోగిస్తున్న రెండు హోటళ్లపై పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. చిట్టినగర్‌లోని బాబాయ్‌ హోటల్‌, సౌమ్య థియేటర్‌ సమీపంలోని ఓ టిఫిన్‌ హోటల్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సౌమ్య థియేటర్‌ సమీపంలోని టిఫిన్‌ హోటల్‌లో ఉన్న ఐదు గ్యాస్‌ సిలిండర్లు, చిట్టినగర్‌ బాబాయ్‌ హోటల్‌లో మూడు గ్యాస్‌ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్‌ సిలిండర్లను వ్యాపారాల కోసం వినియోగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చిట్టినగర్‌లో పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారనే సమాచారంతో సెంటర్‌లోని మరి కొన్ని టిఫిన్‌ హోటళ్లు, బళ్ల నిర్వాహకులు తాళాలు వేసి పరుగులు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement