రేపు పీపీపీకి వ్యతిరేకంగా సామూహిక నిరసన దీక్ష
కృష్ణలంక(విజయవాడతూర్పు): నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీ ఉదయం 10.30 గంటలకు విజయవాడ ధర్నా చౌక్‌లో సామూహిక నిరసన దీక్షను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ దీక్షలో మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొంటారని తెలిపారు. గవర్నర్‌పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ్ భవన్‌లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణకై సామూహిక నిరసన దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ప్రభుత్వ రంగంలోనే ఉంటేనే మేలు..
● ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉంటేనే కోట్లాది మంది ప్రజలకు మెరుగైన ఫలితాలు లభిస్తాయన్నారు. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి ప్రభుత్వ సంస్థలు అత్యున్నత సేవలు అందిస్తున్నాయని తెలిపారు.
● మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ అత్యధిక అసమానతలు ఉన్న భారతదేశంలో వైద్య రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే అసమానతలు తీవ్రతరమవుతాయన్నారు.
● దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకుడు కొరివి వినయ్‌కుమార్ మాట్లాడుతూ దళిత, గిరిజన,బహుజన వర్గాలకు రిజర్వేషన్లు అమలై సామాజిక న్యాయం పొందటానికి మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నారు.
● సామాజికవేత్త డాక్టర్ వసుంధర కుర్ర మాట్లాడు తూ కూటమి పార్టీలు మినహా అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగ అధికార ప్రతినిధి కమలాపురం శ్రీదేవి రెడ్డి, వైఎస్సార్ సీపీ విద్యార్థి యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రవిచంద్ర, ప్రజా ఆరోగ్య వేదిక నాయకుడు జి.విజయ ప్రకాష్, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్న తదితరులు మాట్లాడారు.


